Assembly Elections of four states and one union territory: 2021లో అతి పెద్ద ఎన్నికల పర్వం ప్రస్తుతం కొనసాగుతోంది. అయిదు అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతుండగా ఈ ఎన్నికల పర్వంలో ఏప్రిల్ ఆరో తేదీన కీలక ఘట్టమని భావిస్తున్నారు. యావత్ దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోన్న బెంగాల్‌తోపాటు తమిళనాడు, కేరళ, అస్సాం (మూడో విడత) పుదుచ్ఛేరి అసెంబ్లీలకు ఏప్రిల్ ఆరో తేదీన పోలింగ్ జరగబోతోంది. అత్యంత సుదీర్ఘంగా ఎనిమిది విడతల్లో కొనసాగుతున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏప్రిల్ ఆరో తేదీన మూడో విడత పోలింగ్ జరగనున్నది. సో.. మొత్తం అయిదు అసెంబ్లీల ఎన్నికల పర్వంలో అన్ని చోట్లా పోలింగ్ జరిగే ప్రత్యేక దినంగా ఏప్రిల్ ఆరో తేదీ నిలువబోతోంది.
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలలోని అన్ని స్థానాలకు ఒకే విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ ఆరో తేదీన తమిళనాడులో 234 , కేరళలో 140, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. అటు ఎనిమిది విడతల్లో భాగంగా మూడో దశ పోలింగ్ జరగనున్న బెంగాల్‌లో 31 అసెంబ్లీ సీట్లకు ఏప్రిల్ ఆరో తేదీన మంగళవారం నాడు పోలింగ్ జరుగుతుంది. మరోవైపు అస్సాం అసెంబ్లీకి మూడో విడత పోలింగ్‌లో భాగంగా 40 సీట్లకు మంగళవారం నాడు పోలింగ్ జరగతోంది. బెంగాల్, అస్సాంలలో ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ పూర్తి అయ్యింది. అస్సాంలో ఇదే చివరి విడత కాగా, బెంగాల్‌లో మరో ఐదు విడతల్లో పోలింగ్ జరగనున్నది.
ఇక తమిళనాడులో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. నాలుగు ప్రధాన అలయెన్సులు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచాయి. ఇదివరకే రెండు వరుస అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పదేళ్ళుగా అధికారంలో వున్న అన్నా డిఎంకే మూడోసారి తమదే విజయమని చెప్పుకుంటోంది. ఆ పార్టీ బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. మరోవైపు గత పదేళ్ళుగా విపక్షానికి పరిమితమైన డిఎంకే ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావడానికి యధాశక్తి ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి డిఎంకే ఎన్నికల బరిలోకి దిగింది. ఇంకోవైపు కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం.. మరికొన్ని చిన్నా చితకా పార్టీలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగింది. ఈ మూడో కూటమి ప్రభావం పెద్దగా వుండదని ముందుగా భావించినా.. ఎన్నికల ప్రాసెస్ ప్రారంభం అయిన తర్వాత కమల్ కూటమి కూడా ప్రభావవంతంగానే కనిపిస్తోంది. తమిళనాడు శాసనసభలోని 234 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. మొత్తం 3,998 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మొత్తం 88 వేల 937 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
ప్రస్తుత ఎన్నికలలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఎండీఎంకేతో పొత్తు కుదుర్చుకున్న డీఎంకే పార్టీ విజయం తమదేనని ధీమాగా వుంది. మరోవైపు బీజేపీ, పీఎంకేతో ఎన్నికల పొత్తు కుదుర్చుకున్న అన్నాడీఎంకే.. కూడా మూడోసారి తమదే అధికారమంటూ ప్రకటనలు గుప్పిస్తోంది. నాలుగో కూటమిగా బరిలోకి దిగిన టీటీకే దినకరన్ పార్టీ ఏఎంఎంకే… హైదరాబాదీ పార్టీ ఏఐఏఎంఐఎంతో పొత్తు కుదుర్చుకుని మూడు సీట్లను అసద్ పార్టీకి కేటాయించింది. కాగా.. తమిళనాడు అసెంబ్లీ బరిలో మొత్తం 15 మంది తెలుగు వ్యక్తులు పోటీ చేస్తున్నారు. వీరిలో పది మంది అన్నా డిఎంకే తరపున పోటీ చేస్తుండగా.. మరో అయిదుగురు విపక్ష డిఎంకే తరపున అసెంబ్లీ బరిలోకి దిగారు.
దేవ భూమిలో గెలుపు ఎవ్వరిదో..
కేరళలో మొత్తం అసెంబ్లీ సీట్లు 140 వుండగా.. అధికార లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) విజయోత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. కేరళలో వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ యత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి కూడా విజయంపై ధీమాతో కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళ అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేకంగా శ్రద్ద పెట్టారు. పలు మార్లు ఆయన కేరళలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. యువకులను, పేద వర్గాలను ఆకట్టుకునేందుకు ఆయన ఆటోల్లో తిరగడం, పుషప్స్ కొట్టడం వంటి జిమ్మిక్కులను ప్రదర్శించారు. మరోవైపు ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌లతో కేరళ ప్రజలు విసిగిపోయారు.. ఈసారి తమనే గెలిపిస్తారని భారతీయ జనతా పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. మొత్తమ్మీద గతంతో పోలిస్తే.. ఈసారి ద్విముఖ పోటీ కాకుండా.. త్రిముఖ పోటీ జరుగుతోంది కేరళలో. విజయంపై ధీమాగా వున్న అధికార కూటమికి డాలర్లు, బంగారం స్మగ్లింగ్ వ్యవహారాలు ఇబ్బందిగా మారాయి. ఈ కుంభకోణాల అంశాలనే ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ ప్రచారంలో పదే పదే వల్లిస్తున్నారు. మరోవైపు కేరళలో మొన్నటి దాకా పెద్దగా బలం లేని బీజేపీ.. మెట్రో మ్యాన్ శ్రీధరన్‌ను పార్టీలోకి చేర్చుకుంది. ఆయన్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేస్తూ ఎన్నికలను ఎదుర్కొంటోంది.
ఇక తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి వున్న పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి కూడా ఏప్రిల్ ఆరో తేదీన అసెంబ్లీ జరుగుతున్నాయి. పుదుచ్చేరి అసెంబ్లీలోని మొత్తం 30 స్ధానాలకు ఓకే విడతలో పోలింగ్ జరగనున్నది. ఇటీవల అంతర్గత కుమ్ములాటలతో సీఎం నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ పతనమైంది. పలువురు కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరిపోయారు. అయితే.. డీఎంకేతో పొత్తు ఉన్న కారణంగా తమదే విజయమని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. కాగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు జరిగినందున తమ బలం పెరిగిందని భావిస్తున్న బీజేపీ నేతలు.. పుదుచ్చేరి అసెంబ్లీ తమదేనని చెప్పుకుంటున్నారు.
ALSO READ: నక్సల్ దాడిలో మృతుల సంఖ్య 22.. మందుపాతర పేల్చి కాల్పులకు తెగబడ్డ మావోయిస్టులు