WB Polls 2021: మైనార్టీలకు మమత చేసిందేమీ లేదు…దీదీపై అసదుద్దీన్ ఓవైసీ ఫైర్

|

Apr 09, 2021 | 5:19 PM

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అధికార తృణాముల్ కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలోని మైనార్టీలకు చేసిందేమీ లేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎద్దేవా చేశారు. బీజేపీకి అమ్ముడుపోయిన వ్యక్తులు బెంగాల్‌లో మైనార్టీల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని...

WB Polls 2021: మైనార్టీలకు మమత చేసిందేమీ లేదు...దీదీపై అసదుద్దీన్ ఓవైసీ ఫైర్
Asaduddin Owaisi
Follow us on

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అధికార తృణాముల్ కాంగ్రెస్ పార్టీ(TMC) ఆ రాష్ట్రంలోని మైనార్టీలకు చేసిందేమీ లేదని MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎద్దేవా చేశారు. బీజేపీకి అమ్ముడుపోయిన వ్యక్తులు బెంగాల్‌లో మైనార్టీల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని…వారిని నమ్మొద్దంటూ రెండ్రోజుల క్రితం అసదుద్దీన్‌పై మమతా బెనర్జీ చేసిన పరోక్ష ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. శనివారం బెంగాల్ అసెంబ్లీకి నాలుగో విడత పోలింగ్ నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మమతా బెనర్జీపై అసద్ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. బెంగాల్‌‌లోని గ్రామీణ ప్రాంతాల్లో మైనార్టీలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే వారి  అభ్యున్నతి, సంక్షేమం కోసం మమతా బెనర్జీ ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఓట్ల కోసమే మమత మైనార్టీల పేరు చెప్పుకుంటున్నారని ఆరోపించారు.

పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి అనుమతి నిరాకరించారని అసద్ మండిపడ్డారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని విస్మయం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందు కూడా తమ పార్టీ అభ్యర్థులు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించకుండా మమత సర్కారు అడ్డుకుందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు నుంచే తమ పార్టీ నేతలను టీఎంసీ సర్కారు వేధింపులకు గురిచేసిందని…అక్రమ కేసులతో జైళ్లకు పంపిందని దుయ్యబట్టారు. తమ పార్టీ అభ్యర్థులపై భౌతిక దాడులు కూడా చేశారని ధ్వజమెత్తారు. తృణాముల్ కాంగ్రెస్ పార్టీ రౌఢీయిజం, హింసాత్మక ప్రవృత్తిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. అహంకార ధోరణి కారణంగా టీఎంసీ పతనం ఇక మొదలైనట్లేనని వ్యాఖ్యానించారు.

పశ్చిమ బెంగాల్‌లో మైనార్టీలకు తాను ఏళ్లుగా రక్షణకవచంలా నిలుస్తున్నట్లు మమత చెప్పుకోవడంలో వాస్తవం లేదని ఓవైసీ పేర్కొన్నారు. గోద్రా అల్లర్లపై 2002 ఏప్రిల్ 30న లోక్‌సభలో జరిగిన చర్చలో నేటి ప్రధాని నరేంద్ర మోదీ, నాటి ప్రధాని వాజ్‌పేయి‌లకు మమతా బెనర్జీ అండగా నిలిచారని గుర్తుచేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో మమతా బెనర్జీ కేంద్ర మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. నాటి మమతకు…నేటి మమతకు ఎలాంటి మార్పూ లేదని ఎద్దేవా చేశారు. బీజేపీని పశ్చిమ బెంగాల్‌కు తీసుకొచ్చిన ఘనత కూడా మమతా బెనర్జీకే చెందుతుందన్నారు. తృణాముల్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో మైనార్టీలు, వారి సంక్షేమం గురించి ఎలాంటి ప్రస్తావన లేదని విమర్శించారు.

ఇవి కూడా చదవండి..గుప్త నిధులు దొరికితే.. ఆ నిధి ఎవరికి చెందుతుంది… ఎలా పంచుతారంటే..!

యూపీలో దారుణం.. కరోనా వ్యాక్సిన్‌కు బదులుగా రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చిన వైద్యులు.. మహిళకు అస్వస్థత..