Uttarakhand Election Result: ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్లాన్ వర్కౌట్.. మళ్లీ అధికారంలోకి..

|

Mar 10, 2022 | 3:34 PM

CM Dhami Election Result: అందానికి మారుపేరు.. పర్యాటకానికి నిలువుటద్దం.. దేవభూమిగా ప్రసిద్ధికెక్కిన ఉత్తరాఖండ్‌ ఎన్నికల్లో (Uttarakhand Elections 2022) మరోసారి కాషాయవనమైంది. తన మార్క్‌ విజయంతో సత్తా చాటింది బీజేపీ.

Uttarakhand Election Result: ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్లాన్ వర్కౌట్.. మళ్లీ అధికారంలోకి..
Bjp
Follow us on

అందానికి మారుపేరు.. పర్యాటకానికి నిలువుటద్దం.. దేవభూమిగా ప్రసిద్ధికెక్కిన ఉత్తరాఖండ్‌ ఎన్నికల్లో (Uttarakhand Elections 2022) మరోసారి కాషాయవనమైంది. తన మార్క్‌ విజయంతో సత్తా చాటింది బీజేపీ. కాంగ్రెస్‌ను కకావికలం చేసిన కమలానికి కలిసొచ్చిన అంశాలనేకం.. బీజేపీ గెలుపునకు దోహదం చేసిన కారణాలెన్నో.. ఉత్తరాన హిమవాహినులు.. దక్షిణాన దట్టమైన అడవులతో చూడముచ్చటైన రాష్ట్రం ఉత్తరాఖండ్‌. ఉత్తరాఖండ్‌ పశ్చిమప్రాంతాన్ని గర్హ్‌వాల్ అనీ, తూర్పు ప్రాంతాన్ని కుమో అనీ అంటారు. మొత్తం 70 అసెంబ్లీ సీట్లకు గాను, అత్యధికంగా గర్హ్‌వాల్‌ ప్రాంతంలో 41 స్థానాలున్నాయి. కుమో ప్రాంతంలో 29 అసెంబ్లీ స్థానాలున్నాయి. పర్యాటక ప్రాంతంలో పాతుకుపోయిన బీజేపీ మరోసారి తన పట్టును నిలుపుకుంది.

బీజేపీ గెలుపు ఆషామాషీగా సాధ్యం కాలేదు. పకడ్బందీగా పార్టీ నిర్మాణంతో పాటే.. అభివృద్ధిపైనా స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది కమళదళం. ఐదేళ్లలో కేదార్‌నాథ్ పునర్నిర్మాణాన్ని భుజానికెత్తుకుంది. రాష్ట్రంలో పెద్ద రోడ్లు, రైలు, విమాన కనెక్టివిటీ ప్రాజెక్టులు భారీగా పెరిగాయి.

పైప్‌లైన్‌లోని ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాలే గెలిపిస్తాయనే నమ్మకంతో పనిచేశారు బీజేపీ నేతలు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న 25 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ నిరాకరించి కొత్తవారికి కేటాయించారు. ప్రధాని మోదీ ప్రచారం, కేదార్‌నాథ్‌ అభివృద్ధి, హిందుత్వ ఎజెండాతో దూసుకెళ్లింది బీజేపీ.

తమను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి పుష్కర్‌ ధామి. ఐదేళ్లలో మోదీ అనేకసార్లు ఉత్తరాఖండ్‌ను సందర్శించారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు ప్రధాని మోదీ. ఆర్మీ కుటుంబాల ఓట్లు, వారిలో మోదీకి ఉన్న ఫాలోయింగ్‌ బీజేపీకి బాగా ఉపయోగపడింది. ఉత్తరాఖండ్‌లో ముస్లిం యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ చెప్పడాన్ని హిందూ ఓటర్లలోకి బలంగా తీసుకెళ్లింది బీజేపీ.

అధికార పార్టీపై నెలకొన్న వ్యతిరేకతను అనుకూలంగా మలచుకోవడంలో వెనుకబడింది కాంగ్రెస్‌. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ముఖ్యమంత్రుల మార్పు వంటి సమస్యలతో ప్రజల్లోకి వెళ్లినప్పటికీ కాంగ్రెస్‌ను ప్రజలు విశ్వసించలేదు. సొంత పార్టీలోనే అసమ్మతి, భారీగా బరిలో దిగిన రెబల్స్‌ కాంగ్రెస్‌ను దెబ్బకొట్టారు.

ఇవి కూడా చదవండి: UP Election Results 2022 LIVE: ట్రిపుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్న భారతీయ జనతా పార్టీ లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి..

UP Election Results 2022: ఉత్తర ప్రదేశ్‌లో మోడీ-యోగీ వ్యుహం.. భారతీయ జనతా పార్టీ విజయానికి కారణాలు ఇవే..!