Uttarakhand Congress leader Harish Rawat: వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసింది. గాంధీ కుటుంబానికి విధేయుడిగా, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా పేరున్న మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అలజడి సృష్టిస్తున్నాయి. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సారథ్యం వహిస్తున్న హరీశ్ రావత్ చేస్తున్న కామెంట్స్ కాంగ్రెస్‌కు ఇరుకున పెట్టాయి. పార్టీ అధిష్టానాన్ని ఉద్దేశించిన ట్వీట్స్ చేసిన హరీష్ రావత్.. వాటికి ఎటువంటి వివరణ కూడా ఇవ్వలేదు. తాజాగా సమయం వచ్చినప్పుడు అన్ని చెబుతానని విలేకరులతో వ్యాఖ్యానించడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది.
దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ అధిష్టానం.. శుక్రవారం ఢిల్లీకి రావాల్సిందిగా హరీష్ రావత్‌ను కోరింది. ఆయనతో పాటుగా ఉత్తరాఖండ్ కాంగ్రెస్ పక్షనేత ప్రీతమ్ సింగ్‌ను రేపు ఢిల్లీలో అందుబాటులో ఉండాల్సిందిగా అధినాయకత్వం ఆదేశించింది. ఈ ఇరువురు నేతలు శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఇక, ఉత్తరాఖండ్‌లో విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ ఈ పరిస్థితులు తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి.
బుధవారం రోజున హరీష్ రావత్ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల తీరును ఎండగడుతూ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల సముద్రాన్ని ఈదుకుంటూ వెళ్లాల్సి ఉంది. నేను ఈదుతున్నప్పుడు సొంత పార్టీ నేతలే వెనక్కు నెట్టుతున్నారు, నా కాళ్లు, చేతులు కట్టేస్తున్నారు. నాపైకి మొసళ్లను వదులుతున్నారు. చాలాకాలం నుంచి ఈత కొడుతున్నావు.. ఇదంతా చూస్తుంటే ఇక విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని నా అంతరాత్మ చెబుతోంది. నేను సందిగ్ధ స్థితిలో ఉన్నాను. ఆ కేదారేశ్వరుడే ఒక మార్గాన్ని చూపిస్తాడనే విశ్వాసం ఉంది’ అంటూ వరుస ట్వీట్‌లో పేర్కొన్నారు.
తాజాగా హరీష్ రావత్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై విలేకరులు ప్రశ్నించగా ఆయన వాటిపై వివరణ ఇవ్వకపోగా, జరుగుతున్నది అదే అన్నట్లు వివరణ ఇచ్చారు. ‘సమయం వచ్చినప్పుడు, నేను మీతో ప్రతిదీ పంచుకుంటాను. నేను మీతో మాట్లాడకపోతే.. నేను ఎవరితో మాట్లాడతాను? నేను మీకు ఫోన్ చేస్తాను. ప్రస్తుతానికి, సరదాగా ఉండండి” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆయన రాజకీయాల నుంచి వైదొలుగుతారా అనే అంశంపై కూడా తీవ్ర చర్చ సాగుతుంది. శుక్రవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో జరిగే సమావేశంలో ఎలాంటి చర్చ జరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు, వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరాఖండ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం దీనిని ఎలా పరిష్కరిస్తుందో వేచిచూడాలి.