UP Elections 2022: యూపీలో ఆరో విడత పోలింగ్‌కు సర్వం సిద్దం.. అందరి దృష్టి యోగి పోటీ చేస్తున్న గోరఖ్‌పుర్‌పైనే!
ఉత్తరప్రదేశ్‌అసెంబ్లీ ఎన్నికలు ప్రీ క్లయిమాక్స్‌కు చేరాయి.. గురువారం జరిగే ఆరో విడత పోలింగ్ అధికార భారతీయ జనతాపార్టీకే కాదు, అధికారం కోసం..

ఉత్తరప్రదేశ్‌అసెంబ్లీ ఎన్నికలు ప్రీ క్లయిమాక్స్‌కు చేరాయి.. గురువారం జరిగే ఆరో విడత పోలింగ్ అధికార భారతీయ జనతాపార్టీకే కాదు, అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తోన్న సమాజ్‌వాదీ పార్టీకి కూడా అత్యంత కీలకమే! అంబేద్కర్ నగర, బలరాంపుర్, సిద్ధార్థ్‌నగర్, బస్తీ, సంత్ కబీర్‌నగర్, మహరాజ్‌గంజ్, గోరఖ్‌పుర్, కుశీనగర్, దేవరియా, బలియా జిల్లాలలో ఉన్న మొత్తం 57 అసెంబ్లీ నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరగనుంది. మొత్తం 676 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో అసెంబ్లీ గడపతొక్కే అదృష్టం ఎవరికి దక్కుతుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి పోటీ చేస్తున్న గోరఖ్‌పుర్ అర్బన్ నియోజకవర్గంపైనే అందరి దృష్టి నెలకొంది. అందుకు కారణం ఈసారి పోటీ రసవత్తరంగా ఉండటమే. నిజానికి యోగికి గోరఖ్‌పూర్ కంచుకోటలాంటిది. అక్కడి రాజకీయాలలో యోగి చెప్పిందే వేదం! గోరఖ్‌నాథ్ మఠం చెప్పుచేతల్లోనే అక్కడి రాజకీయాలు ఉంటాయి. గోరఖ్‌పుర్‌పై యోగికి ఎంత పట్టుందో చెప్పడానికి 2002లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలే బెస్ట్ ఎగ్జాంపుల్. అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పుర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున శివ్ ప్రతాప్ శుక్లా పోటీ చేశారు. ఇది యోగికి నచ్చలేదు. అప్పుడు గోరఖ్‌పూర్ ఎంపీగా ఉన్నది యోగీనే! రాజ్‌పుత్‌లు బ్రాహ్మణ అభ్యర్థికి ఓటు వేయరన్న సంగతి యోగికి తెలుసు. యోగీకి బ్రాహ్మణ సామాజికవర్గానికి పడదన్న సంగతి అప్పటి ప్రధాని వాజ్‌పేయికి కూడా తెలుసు. అందుకే యోగిని తన దగ్గరకు పిలుపించుకుని శివ్‌ప్రతాప్ శుక్లా గెలుపు కోసం గట్టిగా కృషి చేయాలని చెప్పి పంపించారు. వాజ్‌పేయి అంతటి పెద్దమనిషి చెప్పినా యోగి వినిపించుకోలేదు. డాక్టర్ రాధామోహన్ దాస్ అగర్వాల్ అనే తన మిత్రుడిని హిందూసభ అభ్యర్థిగా బరిలో దింపారు. ఆయనకు మద్దతుగా ఊరువాడా తిరిగారు. అగర్వాల్‌ను గెలిపించుకుని తన పంతం నెరవేర్చుకున్నారు..బీజేపీకి వ్యతిరేకంగా హిందూ మహాసభ అభ్యర్థికి మఠం బహిరంగంగా మద్దతు ఇవ్వడం ఇదే తొలిసారి. శివప్రతాప్ శుక్లా కూడా ఏం తక్కువ కాదు! నాలుగుసార్లు ఆయన విజయం సాధించాడు.. కానీ అప్పుడు మాత్రం ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది.. అందుకు కారణం యోగినే!
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆదిత్యానాథ్ యోగి మళ్లీ గోరఖ్‌పుర్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గమనించదగిన విషయమేమిటంటే ఇప్పుడు యోగికి వ్యతిరేకంగా పోటీలో ఉన్న వారిలో చాలా మంది ఒకప్పటి ఆయన స్నేహితులే కావడం.. గోరఖ్‌పుర్‌లో బ్రాహ్మణుల ఆధిక్యం కొంచెం ఎక్కువే! ఇప్పుడు అక్కడ నుంచి సమాజ్‌వాది పార్టీ తరఫున పోటీ చేస్తున్నది దివంగత ఉపేంద్ర దత్ శుక్లా భార్య సుభావతి శుక్లా.. ఉపేంద్ర దత్ శుక్లా కూడా బీజేపీలో బలమైన నేతగా ఉండేవారు. యోగి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఉపేంద్ర శుక్లాకు 2018 లోక్‌సభ స్థానానికి ఉపఎన్నికలో బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. అయితే ఆయన ఎస్పీ కూటమి అభ్యర్ధి ప్రవీణ్ నిషాద్ చేతిలో పరాజయం పాలయ్యారు. మే 2020లో ఉపేంద్రదత్ శుక్లా గుండెపోటుతో కన్నుమూశారు. ఉపేంద్ర శుక్లా మరణం తర్వాత బీజేపీ తమను పట్టించుకోలేదన్నది సుభావతి శుక్లా వాదన. అందుకే తాము సమాజ్‌వాదీలో చేరామంటున్నారు. ఈమెకు రాజకీయ అనుభవం పెద్దగా లేదు. మొన్నటి వరకు సాధారణ గృహిణిగానే ఉన్నారు. కాకపోతే బ్రాహ్మణ సామాజికవర్గం మద్దతు ఈమెకే ఉంది.
నిజానికి గోరఖ్‌పుర్‌లోని బ్రాహ్మణులు యోగిపై కోపంతో ఉన్నారు. ఉపేంద్రదత్ మరణించినప్పుడు కూడా యోగి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడాన్ని బ్రాహ్మణులు సహించలేకపోతున్నారు. మొత్తంగా సుభావతికి బ్రాహ్మణుల మద్దతుతో పాటు ఓబీసీల అండదండలు కూడా ఉన్నాయి. సానుభూతి సరేసరి! వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే యోగికి ఈమె గట్టిపోటీని ఇవ్వవచ్చు. అసలు అఖిలేశ్ వ్యూహం కూడా ఇదే! కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న చేతనా పాండే పూర్వాశ్రమం కూడా బీజేపీనే! గతంలో ఆర్‌ఎస్‌ఎస్‌లోనూ, ఏబీవీపీలోనూ ఆమె పని చేశారు. భీమ్ ఆర్మీకి చెందిన చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం చంద్రశేఖర్‌కు ఇదే మొదటిసారి. తొలిసారే ఆయన ముఖ్యమంత్రిని ఢీకొనబోతున్నారు. చిత్రమేమిటంటే చంద్రశేఖర్ ఆజాద్ పోటీలో ఉన్నారన్న విషయం చాలా మందికి తెలియకపోవడం. గోరఖ్‌పుర్‌లో భీమ్ ఆర్మీ హడావుడి ఎక్కడా కనిపించడం లేదు. చంద్రశేఖర్ ఆజాద్‌కు చెందిన ఒక్క ఫ్లెక్సీ కూడా కనిపించడం లేదు.
గోరఖ్‌పుర్‌తో పాటు ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రామ్‌గోవింద్ చౌధరీ పోటీ చేస్తున్న బాంస్‌డీహ్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్‌కుమార్ లల్లూ పోటీ చేస్తున్న తమ్‌కుహీ రాజ్, ఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్య పోటీ చేస్తున్న ఫాజిల్‌నగర్ నియోజకవర్గాలపై కూడా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీని వదిలిపెట్టి ఎస్పీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన అయిదు విడతల పోలింగ్ సరళిని చూస్తే బీజేపీ, ఎస్పీ మధ్య హోరాహోరీ పోరు నడిచిందని అనుకోవచ్చు. అందుకే మిగిలిన రెండు దశల పోలింగ్‌లలో ఆధిక్యం సంపాదించాలని బీజేపీ, ఎస్పీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.