Municipal Elections 2021: పాలమూరులో తిరుగులేని టీఆర్ఎస్.. అచ్చంపేట, జడ్చర్ల మున్సిపాలిటీలు కైవసం

|

May 03, 2021 | 4:37 PM

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గులాబీ జెండాను ఎగురవేసింది. మొదటి సారి ఎన్నికలు జరిగిన జడ్చర్ల మున్సిపాలిటీతో పాటు రెండోసారి అచ్చంపేట మున్సిపాలిటీని టీఆర్ఎస్ దక్కించుకుంది.

Municipal Elections 2021: పాలమూరులో తిరుగులేని టీఆర్ఎస్.. అచ్చంపేట, జడ్చర్ల మున్సిపాలిటీలు కైవసం
Follow us on

Municipal Elections 2021: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీల్లో గులాబీ జెండాను ఎగురవేసింది అధికారపార్టీ. మొదటి సారి ఎన్నికలు జరిగిన జడ్చర్ల మున్సిపాలిటీతో పాటు రెండోసారి అచ్చంపేట మున్సిపాలిటీని టీఆర్ఎస్ దక్కించుకుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు మున్సిపల్ స్థానాలను టీఆర్ఎస్ సునాయసంగా కైవసం చేసుకుంది.

మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్లలో మొత్తం 27 వార్డులకు గానూ 112 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇదే తరహాలో మూడు పార్టీల అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. కానీ, అధిక స్థానాలను అధికార పార్టీ టీఆర్ఎస్ దక్కించుకుని మిగతా పార్టీలకు ‌షాకిచ్చింది. మొత్తం 27 వార్డులున్న జడ్చర్ల మున్సిపాలిటీలో 23 వార్డులను టీఆర్ఎస్ దక్కించుకోగా.. బీజేపీ, కాంగ్రెస్ చెరు రెండు వార్డులను కైవసం చేసుకున్నాయి.

ఇక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీకి రెండోసారి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. మొదటిసారి 2016లో జరిగిన ఎన్నికల్లో 20 వార్డులకు 20 వార్డులను టీఆర్ఎస్ కైవసం చేసుకుని అఖండ విజయం సాధించింది. కానీ, ఈసారీ ఎన్నికల్లో పరిస్థితులు భిన్నంగా కనిపించాయి. మొత్తం 20 వార్డుల్లో 13 వార్డులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఆరు వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఒకే ఒక్క స్థానంలో బీజేపీ గెలిచింది. కౌంటింగ్ ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తున్నట్లు కనిలించినప్పటికీ తర్వాత టీఆర్ఎస్ అనుహ్యంగా పుంజుకుని తన హవాను కొనసాగించింది.

కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కరోనా నిబంధనలను పకడ్బందీగా అమలు చేశారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలను నిషేధించారు.

Read Also….  Telangana Municipal Corporations Election Results 2021 LIVE: తెలంగాణ మినీ మున్సిపల్ ఫలితాలు.. కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ