Manipur Elections: మణిపూర్‌లో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు.. ఈసారి చిగురించనున్న కొత్త పొత్తు!
మణిపూర్‌లో అధికార భారతీయ జనతా పార్టీ (BJP) వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది.
Manipur Assembly Elections 2022: మణిపూర్‌లో అధికార భారతీయ జనతా పార్టీ (BJP) వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందు కోసం, కాన్రాడ్ సంగ్మాకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP)కి దూరంగా ఉండి, నాగా పీపుల్స్ ఫ్రంట్ (NPF)తో చేతులు కలిపేందుకు సిద్దమవుతోంది బీజేపీ. అయితే, బీజేపీ, ఎన్‌పీఎఫ్‌ల మధ్య సీట్ల పంపకంపై ఇప్పటి వరకు ప్రత్యేకించి ఎలాంటి చర్చలు జరగలేదు. ఇటీవల ఎన్‌పీఎఫ్ నాయకత్వం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ కేంద్ర నేతలతో సమావేశమైంది. త్వరలో సీట్ల పంపకాలపై ఇరు పార్టీల మధ్య స్నేహపూర్వక పోరు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈసారి 15 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ఎన్‌పిఎఫ్ భావిస్తోంది. గత ఎన్నికల్లో 10 స్థానాల్లో పోటీ చేసిన ఎన్‌పీఎఫ్ ఇందులో నలుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించారు. మరోవైపు, కాన్రాడ్ సంగ్మా పార్టీతో పొత్తు కారణంగా ప్రస్తుతం బీజేపీ మేఘాలయలో అధికారంలో కొనసాగుతోంది. అయితే ఈసారి ఎన్నికల్లో నేషనల్ పీపుల్ పార్టీతో కలిసి వెళ్లేందుకు బీజేపీ విముఖత వ్యక్తం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో NPP, NPF కలిసి పోటీ చేసే అవకాశం లేకపోవడంతో.. బీజేపీ ఏదోక పార్టీతో ఎన్నికల సమరానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈసారి NPFతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
చివరిసారిగా బీరెన్ సింగ్ ప్రభుత్వం ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు, నలుగురు ఎన్‌పిపి ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. చివరికి NPF సభ్యుల మద్దతుతో ప్రభుత్వం నిలబడింది, కాగా, మణిపూర్‌లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ మరోసారి తన సత్తా చాటుతోంది. రాష్ట్రంలోని మొత్తం 60 స్థానాల్లో బీజేపీ కూడా తమ అభ్యర్థులను బరిలోకి దించవచ్చని చెబుతున్నారు. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు గానూ 40 స్థానాలు గెలవాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.
మణిపూర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గరపడుతుండటంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడేక్కాయి. మణిపూర్‌లో ఫిబ్రవరి 27 నుంచి ఎన్నికలు జరగనున్నాయి. మణిపూర్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం తెలిపింది. మొదటి దశ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరగనుండగా, రెండో దశకు మార్చి 3న పోలింగ్ జరగనుంది. అన్ని రాష్ట్రాలతో పాటు మణిపూర్ ఓట్ల లెక్కింపు కూడా మార్చి 10న జరగనుంది.
ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశకు ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ దశ అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఫిబ్రవరి 8 చివరి తేదీ కాగా, నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 11 చివరి తేదీ. ఆ తర్వాత ఫిబ్రవరి 4న రెండో విడత పోలింగ్‌కు నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ దశలో అభ్యర్థులు ఫిబ్రవరి 11 వరకు నామినేషన్లు వేయవచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 16 చివరి తేదీ.
Read Also….. Punjab Elections: కాక రేపుతున్న పంజాబ్ పాలిటిక్స్.. ఆమ్‌ఆద్మీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు!