AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు బీఆర్ఎస్‌కు గుడ్‌ బై చెప్పేశారు. బీఆర్‌ఎస్‌లో కేకేకి అత్యున్నత స్థానం కల్పించారు కేసీఆర్‌. అలాంటి వ్యక్తి పార్టీని వీడుతారని ఎవ్వరూ ఊహించలేదు.

Telangana: బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
Kk And Vijayalaxmi
Balu Jajala
|

Updated on: Mar 28, 2024 | 9:10 PM

Share

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు బీఆర్ఎస్‌కు గుడ్‌ బై చెప్పేశారు. బీఆర్‌ఎస్‌లో కేకేకి అత్యున్నత స్థానం కల్పించారు కేసీఆర్‌. అలాంటి వ్యక్తి పార్టీని వీడుతారని ఎవ్వరూ ఊహించలేదు. కానీ కేకే మాత్రం కారు దిగాలని డిసైడ్ అయ్యారు. ఈనెల 22న కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ స్వయంగా కేశవరావు నివాసానికి వెళ్లారు. కేశవరావుతో పాటు ఆయన కూతురు, మేయర్ విజయలక్ష్మిని కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. దీపాదాస్‌ మున్షీ ఆహ్వానంతో.. తండ్రి, కూతురు ఇద్దరూ బీఆర్ఎస్‌ను వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లి కేసీఆర్‌కు కేశవరావు స్వయంగా వివరించారు.

కేశవరావు పార్టీ మార్పు ప్రతిపాదనపై కేసీఆర్‌ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. పదేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ మారితే ప్రజలు ఏమంటారో ఆలోచించారా అని ప్రశ్నించారట. అయినా బీఆర్‌ఎస్‌ ఏం తక్కువ చేసిందని కఠిన నిర్ణయం తీసుకుంటున్నారో చెప్పాలని నిలదీసినట్టు సమాచారం. దేనికీ సమాధానం ఇవ్వని కేకే.. చివరగా కాంగ్రెస్‌లోనే చనిపోతానని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

కేశవరావు రాజకీయ జీవితం కాంగ్రెస్‌ పార్టీ నుంచే మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌.. కేకేను స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. గులాబీ కండువా కప్పుకున్న అనంతరం రాజకీయ వ్యవహారాల్లో కేకేతో కలిసి కేసీఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2018లో ప్రభుత్వం రద్దు.. అభ్యర్థుల ఎంపిక లాంటి వాటితోపాటు ప్రభుత్వ వ్యవహారాల్లో కేసీఆర్‌కు సలహాదారుగా కేకే వ్యవహరించారు. రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు. ఆయనకు పార్టీలో అత్యున్నత పదవి కట్టబెట్టారు. కేకే కూతురు విజయలక్ష్మికి హైదరాబాద్‌ మేయర్‌ పదవి ఇచ్చారు. అయినప్పటికీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేకే పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.

కారు దిగాలని తండ్రీకూతురు నిర్ణయం తీసుకున్నప్పటికీ.. కేకే తనయుడు విప్లవ్ మాత్రం పార్టీ మారేదేలే అని స్పష్టం చేశారు. తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని.. కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తానని ప్రకటించారు. ఫైనల్‌గా కేకే నిర్ణయం బీఆర్‌ఎస్ వర్గాలను ఆగ్రహావేశాలకు గురిచేస్తోంది. ఇన్నాళ్లు పదవులు అనుభవించి.. అధికారం కోల్పోగానే పార్టీని వీడటం ఏమాత్రం నైతికత అనిపించుకోదని మండిపడుతున్నాయి.