
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముఖచిత్రం రోజురోజుకు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. పోలింగ్ తేదీ దగ్గరవుతుండడంతో అన్ని పార్టీలు ప్రచారంలో వేగాన్ని పెంచాయి. ప్రధాన నాయకులంతా కాలికి బలపం కట్టుకుని మరీ ప్రచారంలో పర్యటిస్తున్నారు. తాజాగా మే ఒకటవ తేదీన భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి కన్నడ ప్రజలకు తాయిలాలను ప్రకటించింది. తమ పార్టీకి ఓటు వేసి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు తోడ్పడితే కన్నడ ప్రజలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని, ఉచితంగానే నందిని పాలను అందిస్తామని బిజెపి తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొంది. ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని ప్రయత్నాలను తమ మేనిఫెస్టోలో చేసినట్టు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. జాతీయస్థాయిలో తాము అమలు చేస్తామని చెబుతూ వస్తున్న కామన్ సివిల్ కోడ్‌ని ముందుగా కర్ణాటకలో అమలు చేస్తామని సంచలనమైన హామీని ఇవ్వడం విశేషం. కర్ణాటకలో బిజెపి అధికారంలోకి మళ్లీ వస్తే 10 లక్షల ఉద్యోగాలు, పేదలందరికీ ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించారు. ఇటీవల కన్నడ రాజకీయాలను కుదిపివేసిన నందిని పాల బ్రాండ్‌ను కూడా బిజెపి తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం విశేషం ‘‘ప్రజా ప్రణాళిక’’ పేరిట బిజెపి తమ మేనిఫెస్టోని విడుదల చేసింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా మేనిఫెస్టోని విడుదల చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నేత యడ్యూరప్ప కలుపుగోలుగా కనిపించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. అన్ని వర్గాలకు న్యాయం అందించడం, సంక్షేమ, అభివృద్ధి పలాలను చేరువ చేయడం బిజెపి లక్ష్యం అని నడ్డా ఈ సందర్భంగా ప్రకటించారు.
మరోవైపు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. కన్నడ నాట ఎన్నికల ప్రచారానికి వచ్చి వెళుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యర్థుల మీద ఆరోపణలలో పదును పెంచారు. తాజాగా ఓ బహిరంగ సభలో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. కన్నడ కాంగ్రెస్ నేతలందరూ ఢిల్లీలో ఒక కుటుంబానికి బానిసలని వ్యాఖ్యానించారు. ఆ కుటుంబ ఆశీస్సులు పొందటమే వారికి ముఖ్యమని.. ప్రజా సంక్షేమం కాంగ్రెస్ నేతలకు పట్టదని మోదీ అన్నారు. కాంగ్రెస్ నేతల రక్తంలో 85 శాతం కమిషన్ కాన్సెప్ట్ ఉందని విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడే ఏ పని చేసినా అందుకు కేటాయించే నిధులలో 85 శాతం కాంగ్రెస్ నేతలు కాజేస్తారని సంచలనమైన ఆరోపణలు చేశారు ప్రధాని మోదీ. కన్నడ నాట మరో ప్రధాన పార్టీ జనతాదళ్ సెక్యులర్ పైన మోదీ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు ఒక కుటుంబానికి బానిసలైతే.. జెడిఎస్ ఒకే కుటుంబానికి చెందిన పార్టీ అని ఎద్దేవా చేశారు. భారతీయ జనతా పార్టీకి ప్రజల అభివృద్ధి ఒక ప్రధానమైన ఎజెండా అని.. అది గుర్తించి తమకు ఓటేసి గెలిపించాలని కన్నడ ప్రజలను మోదీ కోరారు.
కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఎదురు దాడికి దిగారు. అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో తనతో పోటీ పడాలని సిద్ధరామయ్య మోదీకి సవాల్ విసిరారు. మిషన్ 150 పేరిట బీజేపీ దూకుడును ప్రదర్శిస్తూ ఉండగా కాంగ్రెస్, జెడిఎస్ నేతలు దీటైన స్థాయిలో స్పందిస్తున్నారు. కర్ణాటకలో పలువురిని ముఖ్యమంత్రిని చేసిన బిజెపికి ఇప్పుడు స్థానిక నేతలు కాకుండా జాతీయ నేతలైన నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలే దిక్కైనట్లుగా కనిపిస్తోంది. దాంతో గత మూడు నెలలుగా ప్రధాని మోదీ కర్ణాటకకు తరచూ వస్తున్నారు. అన్ని జిల్లాలలో ఆయన పర్యటిస్తున్నారు. ఈసారి కర్ణాటకలో మ్యాజిక్ మార్క్ దాటి తగిన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కర్ణాటక బిజెపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో లింగాయతుల మద్దతుతో అత్యధిక సీట్లు గెలుస్తూ వస్తున్న బిజెపి ఈసారి లింగాయత్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఒక్కలిగ సామాజిక వర్గాల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. వారికి తాయిలాలను ప్రకటిస్తూ వస్తోంది. యడ్యూరప్పను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే లింగాయతులు తమకు దూరం కావచ్చని భయపడిన కమలనాధులు, ఆయనకు తగిన ప్రాధాన్యమిస్తున్నట్లు పార్టీ శ్రేణులకు సందేశమిస్తున్నారు. ఇటీవల పార్టీ వీడిన జగదీష్ శెట్టర్ లాంటి వారితో బిజెపికి నష్టం కలగవచ్చు అన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దానికి తోడు జాతీయస్థాయిలో మోదీ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను కాంగ్రెస్ పార్టీ, జెడిఎస్ నాయకులు బలంగా ప్రచారం చేస్తున్నారు. కొంతమంది సీనియర్ నాయకుల పార్టీ ఫిరాయింపులు, ఉత్తర కర్ణాటకలో తగిన నాయకత్వం లేకపోవడం, లింగాయతులను నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు బిజెపికి ఇబ్బందికరంగా మారాయి వీటిని పార్టీ ఎలా అధిగమిస్తుంది అన్నది వేచి చూడాలి. వీటి ప్రభావం తేలాలంటే మే 13వ తేదీ దాకా ఎదురు చూడక తప్పదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..