Gujarat Elections 2022: బీజేపీ చేతిలో ఈడీ, సీబీఐ కీలుబొమ్మలు.. చిదంబరం సంచలన ఆరోపణలు

సీబీఐ, ఈడీలు కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారాయంటూ మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం సంచలన ఆరోపణలు చేశారు.

Gujarat Elections 2022: బీజేపీ చేతిలో ఈడీ, సీబీఐ కీలుబొమ్మలు.. చిదంబరం సంచలన ఆరోపణలు
P Chidambaram

Updated on: Nov 08, 2022 | 5:33 PM

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆ రాష్ట్రంలో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌‌లో ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సీబీఐ, ఈడీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారాయంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు పూర్తిగా బీజేపీ నేతల కనుసన్నల్లో పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు.  సీబీఐ, ఈడీలు అరెస్టు చేసిన వారిలో 95 శాతం మంది విపక్షాలకు చెందిన రాజకీయ నాయకులే ఉన్నారని చెప్పారు.

బీజేపీ నేతలకు అధికార గర్వం తలకెక్కిందంటూ చిదంబరం విరుచుకపడ్డారు. 135 మంది ప్రాణాలను బలితీసుకున్న గుజరాత్‌‌లోని మోర్బి కేబుల్ బ్రిడ్జి దుర్ఘటనకు బీజేపీ నుంచి ఇప్పటి వరకు ఎవరూ క్షమాపణ చెప్పలేదన్నారు. ఈ ఘటనకు బాధ్యతవహిస్తూ బీజేపీ పాలకులు ఎవరూ రాజీనామా చేయలేదని దుయ్యబట్టారు. బీజేపీ గర్వానికి ఇది పరాకాష్ఠగా ధ్వజమెత్తారు. విదేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే బాధ్యులైన పాలకులు తమ పదవులకు రాజీనామా చేసేవారని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో సులభంగా గెలుస్తామన్న ధీమాతోనే కేబుల్ బ్రిడ్జి ఘటనకు బీజేపీ నుంచి ఎవరూ బాధ్యతవహించడం లేదని చిదంబరం ఆరోపించారు. కొన్నిసార్లు ప్రభుత్వాలను ప్రజలను ఓడిస్తేనే..వారి బాధ్యతలు తెలిసొస్తాయని వ్యాఖ్యానించారు. గుజరాత్‌ ప్రజలు బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీకి అధికార పగ్గాలు అప్పగించాలని కోరారు. గుజరాత్ పాలన ఢిల్లీ నుంచే నడుస్తోందని.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎలాంటి అధికారాలు లేవని చిదంబరం ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో డిసెంబరు 1, 5 తేదీల్లో జరగనున్నాయి. డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..