
అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అందరి దృష్టి ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌పైనే ఉన్నప్పటికీ.. హిమాలయ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సరళి, ఓటరు నాడి ఆసక్తి రేపుతున్నాయి. గత మూడున్నర దశాబ్దాలుగా ప్రభుత్వాలను మార్చుతూ వస్తున్న ఈ రాష్ట్రంలో ఈసారి ఆ ఆనవాయితీకి బ్రేక్ వేయాలని భారతీయ జనతా పార్టీ చూస్తుంటే.. చిన్న రాష్ట్రమైనా సరే గెలిచి దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో నైతికస్థైర్యం నింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వే ఫలితాలు చూస్తుంటే ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కారు వైపు కాస్త మొగ్గుచూపుతున్నట్టు అర్థమవుతోంది. హిమాచల్ అసెంబ్లీలోని మొత్తం 68 సీట్లలో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా మ్యాజిక్ ఫిగర్ 35 దాటాలి లేదా కనీసం ఆ సంఖ్యను చేరుకోవాలి. అయితే పీపుల్స్ పల్స్ అనే ఓ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం బీజేపీకి 35 నుంచి 40 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ 25 నుంచి 30 స్థానాల్లో గెలుపొంద వచ్చని అంచనా వేసింది. పొరుగునే ఉన్న పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీలను వెనక్కి నెట్టి అధికారాన్ని చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రాష్ట్రంలో సీట్లు గెలుపొందడం కంటే ఓటుబ్యాంకును చీల్చడం వరకే పరిమితమవుతుందని ఈ సర్వే చెబుతోంది. ఆ పార్టీ గరిష్టంగా 1 లేదా రెండు సీట్లు గెలిచే అవకాశముందని వెల్లడించింది. మొత్తంగా ఈ సర్వే ఫలితాలు చూస్తుంటే బీజేపీ అటూ ఇటుగా మ్యాజిక్ ఫిగర్ చేరుకునేలా కనిపిస్తోంది. 2017 మాదిరిగా 44 సీట్లు గెలుపొందే అవకాశాలైతే లేవని స్పష్టమవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రవేశంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడంతో పాటు సాంప్రదాయ కాంగ్రెస్ ఓటుబ్యాంకు సైతం కొంతమేర దెబ్బతింటోందని ఈ సర్వే ద్వారా తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ లేకపోతే బీజేపీకి కాంగ్రెస్ నుంచి మరింత గట్టిపోటీ ఎదురయ్యేదని అర్థమవుతోంది. ఈ సర్వే అంచనాలు నిజమైతే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మూడున్నర దశాబ్దాల చరిత్రను తిరగరాసి వరుసగా రెండోసారి ఒకే పార్టీని గెలిపించినట్టవుతుంది.
హిమాచల్ ప్రదేశ్ చిన్న రాష్ట్రం కావడం, హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న రాష్ట్రమైనందున నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య కూడా తక్కువగా ఉండడం వంటి అంశాలు గెలుపోటముల మధ్య వ్యత్యాసాన్ని చాలా తక్కువ ఉండేలా చేస్తాయి. దీంతో సర్వే అంచనాలు అన్ని సందర్భాల్లోనూ నిజమవుతాయని భావించడానికి వీల్లేదు. పైగా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత, ఎన్నికల ప్రచారం మొదలయ్యాక పరిస్థితి తారుమారైనా ఆశ్చర్యపోనవరం లేదు. అభ్యర్థుల బలాబలాలు, అభ్యర్థులపై వ్యతిరేకత, ఎన్నికల హామీలు, చివరి నిమిషం ఎత్తుగడలు వంటివి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి.
పర్వతాలు, లోయలతో కూడిన ఈ రాష్ట్రంలో దశాబ్దాలుగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ప్రధానంగా తలపడుతూ వచ్చాయి. అయితే ఢిల్లీ తర్వాత పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ మధ్య జరిగిన అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు ప్రయత్నించింది. ముఖ్యంగా చిన్న రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలపై దృష్టి కేంద్రీకరించింది. కానీ హిమాచల్ ప్రదేశ్‌లో ఆ పార్టీ అంతగా విస్తరించలేదని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం ఓటర్లలో ఆ పార్టీ కేవలం 6 శాతం ఓటర్లనే ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది. ఇతర రాజకీయ పార్టీలు కొన్ని ఉన్నప్పటికీ, అవేవీ అధికారం కోసం పోటీపడే స్థాయిలో లేవు.
రాష్ట్రంలోని రెండు ప్రధాన స్రవంతి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు సుదీర్ఘ కాలంగా నేతృత్వం వహించిన సీనియర్ నాయకులిద్దరూ ఈ ఎన్నికల్లో లేరు . కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ మరణించగా, బీజేపీ నేత, మాజీ సీఎం ప్రేమ్‌కుమార్ ధుమాల్ వృద్దాప్యం కారణంగా ఎన్నికలకు దూరమయ్యారు. ఈ ఇద్దరి ఛత్రఛాయ లేకుండా తదుపరి తరం హయాంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. ‘ఎన్నికల రాజకీయాల్లో’ బీజేపీ దేశవ్యాప్తంగా బలపడుతుండగా.. మరోవైపు ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ బలహీనపడుతున్న స్థితిలో ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతున్నాయి. 12 జిల్లాలుగా విస్తరించిన ఈ హిమాలయ రాష్ట్రంలో గ్రామీణ జనాభాయే ఎక్కువ. 68.64 లక్షల మొత్తం జనాభాలో 3,226 గ్రామ పంచాయతీలు, వాటికి అనుబంధంగా ఉండే కుగ్రామాలతో కలిపి మొత్తం 89 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే నివిస్తోంది. ఎస్సీలు 25 శాతం మంది ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలే అధిక సంఖ్యాకులైనప్పటికీ సుదీర్ఘ కాలంగా రాజ్‌పుత్‌లు, బ్రాహ్మణులే ఇక్కడి రాజకీయాల్ని తమ అదుపులో ఉంచుకుని శాసిస్తున్నారు. పార్టీ ఏదైనా ముఖ్యమంత్రులు ఆయా వర్గాల నుండే ఎంపికవుతున్నారు. వీరభద్ర సింగ్, ప్రేమ్ కుమార్ ధుమాల్ తరం మారినా సరే.. ఆయా వర్గాలకు చెందిన నేతలే అగ్రస్థానాల్లో ఉన్నారు.
ప్రజల్లో నిర్దిష్టంగా బలమైన ప్రజా వ్యతిరేకత ఏమీ లేదు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఈ ఐదేళ్లలో నిర్మించిన ప్రజా ఉద్యమాలు, ఆందోళనలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ లేవు. రాష్ట్రంలో, కేంద్రంలోనూ అధికారంలో ఉండటం బీజేపీకి కలిసొచ్చిన అంశం. పైగా ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ అంటూ ఆ పార్టీ నేతలు పదే పదే ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీకి అన్ని నియోజకవర్గాల్లో, వివిధ స్థాయిల్లో నాయకుల, కార్యకర్తలు శ్రేణులుండటం సానుకూలమైన అంశం. ముఖ్యమంత్రిగా జైరామ్ ఠాకూర్‌కు మంచి పేరుండటం, ఆయన పదవీ కాలం పెద్ద వివాదాలేమీ లేకుండా గడచిపోవడం ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి లాభించనున్నాయి. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఈ రాష్ట్రానికే చెందినవాడు కావడం, కింది స్థాయి కార్యకర్తల వరకు పార్టీకి బలమైన యంత్రాంగం ఉండడంతో పాటు పటిష్ట పునాదులతో ఆరెస్సెస్ వ్యవస్థ వేళ్లూనుకొని ఉండటం పార్టీకి వెన్నుదన్నుగా ఉంది. ఇది కాకుండా రాష్ట్రంలో నిశ్శబ్ద ఓటు బ్యాంక్ తుది ఫలితాన్ని బీజేపీకి అనుకూలంగా ప్రభావితం చేసే అవకాశాలున్నట్టు ప్రజల మనోగతాన్ని బట్టి అర్థమవుతోంది. కుల, వర్గ సమీకరణాలతో అభ్యర్థుల ఎంపికలో వ్యూహ`ప్రతివ్యూహాలు, యాపిల్ రైతుల ఆవేదన, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అగ్రవర్ణ ‘స్వర్ణ ఆయోగ్’ రాజకీయ ఎత్తుగడలు, ఇతర కుల సంఘాల, కూటముల ప్రణాళికలు తదితరాంశాలు పోలింగ్ తేదీ సమీపిస్తుంటే గెలుపోటములను స్వల్పంగా ప్రభావితం చేసే అవకాశముంది.
మరోవైపు రాష్ట్రం మొత్తాన్ని ప్రభావితం చేయగల్గిన కాంగ్రెస్ సీనియర్ నేతలు వీరభద్ర సింగ్, జీఎస్ బాలిల మరణం ఆ పార్టీకి పెద్ద లోటుగా మారింది. వారి స్థానాలను భర్తీ చేయగల్గిన నేతలు కాంగ్రెస్‌లో లేకపోవడం బీజేపీకి కలిసొచ్చే అంశంగా మారింది. పొరుగు రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో ఇటీవలే బీజేపీ వరుసగా రెండో సారి అధికారం దక్కించుకోవడం ఆ పార్టీ శ్రేణులకు నైతిక బలాన్ని ఇస్తున్నాయి. నిరుద్యోగ సమస్య, ఉద్యోగస్థులకు పాత పెన్షన్ స్కీమ్ పునరుద్దరణ హామీ నెరవేర్చకపోవడం, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకపోవడం వంటివి అధికార బిజెపి పార్టీకి ప్రతికూలాంశాలు. పార్టీ అంతర్గత విబేధాలు, ముఖ్యంగా జైరామ్ ఠాకూర్, పి.కె.ధూమల్ వర్గాల మధ్య పోరు వంటివి బీజేపీకి పార్టీకి నష్టం చేసే అవకాశాలున్నాయి.
హిమాచల్‌లో కాంగ్రెస్ పార్టీకీ కలిసొచ్చే పలు సానుకూలాంశాలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రతి జనావాసంలోనూ పార్టీ పాదముద్రలుండటం, ఇప్పటికీ చెక్కుచెదరని కార్యకర్తల వ్యవస్థ కాంగ్రెస్‌కు బలం. ప్రతిసారీ విపక్షానికి పట్టం గట్టే రాష్ట్ర ఓటర్ల మనస్తత్వం ‘ఈసారి ప్రభుత్వం కాంగ్రెస్‌దే’ అనే చర్చకు దారితీస్తోంది. పైగా 2021లో ఉప ఎన్నికలు జరిగిన ఒక లోక్‌సభ, మూడు అసెంబ్లీ స్థానాల్లో అంతటా కాంగ్రెస్ గెలవటం ఆ పార్టీకి రెట్టింపు స్థైర్యాన్ని ఇస్తోంది. ఇక బలహీనతలు, ప్రతికూలాంశాలను పరిశీలిస్తే.. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, సీనియర్ నేతలు లేకపోవడం, ఇటీవలి ఎన్నికల్లో ఒక రాష్ట్రంలోనైనా గెలువకపోవడం వంటివి పార్టీ శ్రేణుల నైతికస్థైర్యాన్ని బాగా కృంగదీస్తున్నాయి. పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభాసింగ్‌కు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇవ్వకపోవడం తదితర అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఆమ్‌ఆద్మీ పార్టీ విస్తరణ కూడా ప్రధాన విపక్షమైన కాంగ్రెస్ విజయావకాశాలను గండికొట్టడం కూడా పార్టీకి ప్రతికూలాంశంగా మారింది. ప్రస్తుతం భారత్ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో స్థైర్యాన్ని నింపుతూ ముందుకు సాగుతున్న రాహుల్ గాంధీ, ఎన్నికలు జరుగుతున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అడుగుపెట్టకుండా యాత్ర జరపడం కొంత నిరుత్సాహాన్ని కల్గిస్తోంది. ప్రతికూల, సానూకూలాంశాలు ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ అటూఇటూగా మారుతూ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుంటాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..