Exit Polls 2021: భారతదేశపు సార్వత్రిక ఎన్నికల ముందు అతిపెద్ద ఎన్నికలుగా.. దాదాపుగా ఆ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. అన్ని చోట్లా రాజకీయ పక్షాలు తమ సర్వశక్తులూ ఒడ్డాయి. వెస్ట్ బెంగాల్, అస్సాం, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ అందరి దృష్టి ఆకర్షించి అతి సుదీర్ఘంగా సాగిన ఎన్నికలు వెస్ట్ బెంగాల్ ఎన్నికలు. ఇక్కడ జాతీయ అధికార పార్టీ బీజేపీని అడ్డుకోవడం కోసం రాష్ట్రంలో అధికారంలో టీఎంసీ అన్నిరకాలుగానూ ప్రయత్నించింది. కాంగ్రెస్ పార్టీ కనీస ప్రభావం చూపిస్తుందా అని అనుమానం కలిగేలా ఎన్నికలు సాగాయి. ఇక్కడ కమ్యూనిస్టులు కూడా బీజీపీ టీఎంసీ పార్టీల మధ్య పోరులో ప్రేక్షక పాత్ర వహించినట్టు అనిపించింది. ఇక తమిళనాట ఎప్పటిలానే.. రెండు ప్రాంతీయ పార్టీలు డీఎంకే, అన్నా డీఎంకే లు మళ్ళీ నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. ఇక కేరళలో అధికార యూడీఎఫ్, ప్రతిపక్ష ఎల్డీఎఫ్ ల మధ్య పోరు సాగింది. పాండిచ్చేరి లో ఎన్డీయే, యూపీఏల మధ్య ఎన్నికల యుద్ధం నడిచింది. ఇక ఈశాన్య రాష్ట్రం అస్సాం లో కూడా ఎన్డీఏ, యూపీఏ కూటముల మధ్య పోరు హోరా హోరీగా సాగింది. ఇక ఎన్నికల చివరి దశ పోలింగ్ పూర్తి కావడంతో ఓటర్ల నాడిని పట్టుకునే దిశలో కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. వాటితో పాటు టీవీ9 కూడా ఎగ్జిట్ పోల్స్ ను నిర్వహించింది. ఇక ఎన్నికలు పూర్తయిన నేపధ్యంలో ఈ ఎన్నికల పోరుకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను అన్ని సంస్థలు వెల్లడించాయి. వాటి ప్రకారం ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం లోకి వచ్చే అవకాశం ఉందో ఒకసారి పరిశీలిద్దాం..
వెస్ట్ బెంగాల్ పోరు..
దీదీ మమతా బెనర్జీ.. బీజెపీని అడ్డుకోవడం కోసం చేయని ప్రయత్నం లేదు. ఇక్కడ అధికార తృణమూల్ కు వ్యతిరేక పవనాలు గట్టిగా ఉన్నాయని పలు సర్వేలు చెప్పాయి. ఈ నేపధ్యంలో మమతా తన పార్టీ నుంచి పాత కాపులను పక్కన పెట్టి దాదాపు 60 శాతం కొత్తవారికి అవకాశం కల్పించింది. ఇక భారతీయ జనతా పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఏమాత్రం ప్రభావం చూపించలేదు. అయితే, రెండేళ్ళ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటింది. ఏకంగా 40.64 శాతం ఓట్లతో 18 సీట్లను సాధించి అధికార తరుణమూల్ కు గట్టి సవాల్ విసిరింది. ఇక అక్కడ నుంచి టీఎంసీ-బీజేపీ ల మధ్య యుద్ధం మొదలైంది. ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే.. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పూర్తిగా బీజేపీ ని టార్గెట్ చేసుకునే రాజకీయాలు చేశారు. ఎన్నికల్లో కూడా తనకు గట్టిపోటీ బీజేపీ మాత్రమె అన్నట్టు ప్రచారం చేశారు. ఇక సుదీర్ఘంగా జరిగిన ఎన్నికల ప్రక్రియలో వెలువడిన ఎగిట్ పోల్స్ ఫలితాలు అన్నీ దాదాపు మమతా బెనర్జీ విజయం ఖాయమని చెబుతున్నాయి. ఇక్కడ మొత్తం 292 స్థానాలకు గానూ 147 స్థానాలు గెలిస్తే అధికారం సాధించినట్టే. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ 150 నుంచి 160 సీట్లను గెలుచుకోవచ్చు. అటు బీజేపీ కూడా మమత పార్టీకి గట్టిపోటీ ఇచ్చింది. ఇక్కడ ఈ పార్టీకి ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం దదాప 118 నుంచి 130 వరకూ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఎదిఎమైనా దేశం దృష్టి ఆకర్షించిన వెస్ట్ బెంగాల్ లో మమతా గెలుస్తుంది అనేది అన్ని పక్షాలు స్పష్టంగా చెబుతున్నాయి.
టీవీ 9 భారత్ వర్ష ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెస్ట్ బెంగాల్ లో టీఎంసీ: 142-152, బీజేపీ: 125-135, కాంగ్రెస్ – లెఫ్ట్ కూటమి: 16-26 స్థానాల్లోనూ విజయం సాధించే అవకాశాలు ఉన్నట్టు వెల్లడైంది.
అస్సాంలో అధికారం ఎవరిది?
అస్సాంలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే ప్రస్తుతం అధికారంలో ఉంది. తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్డీయే అన్ని ప్రయత్నాలు చేసింది. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ కూటమి అన్ని విపక్షాలనూ ఒక్క తాటిపైకి తెచ్చి అధికార పార్టీతో పోరుకు రెడీ అయింది. అయితే, ఇక్కడ ఎగ్జిట్ పోల్ ఫలితాలు అధికార ఎన్డీయే కూటమికే మళ్ళీ పట్టం కడుతున్నాయి. ఇక్కడ మొత్తం సీట్లు 126. మేజిక్ ఫిగర్ 64 సీట్లు. ఇక్కడ ఎన్డీయే మేజిక్ ఫిగర్ దతుతుందనే ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే, గెలుపు మార్జిన్ మాత్రం గత ఎన్నికల కంటె బాగా తగ్గుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.
టీవీ 9 భారత్ వర్ష ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో అస్సాంలో ఎన్డీయే 41.70 శాతం ఓట్లతో 59 నుంచి 69 సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా యూపియే కూటమి 45.40 శాతం ఓట్లతొ 55 నుంచి 65 సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇతర పార్టీలు 12.09 శాతం ఓట్లను సాధించి 1 నుంచి 3 సీట్లను సాధించవచ్చు.
తమిళనాట డీఎంకే హవా?
ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద అసెంబ్లీలలో తమిళనాడు ఒకటి. ఇప్పటివరకూ మనం చెప్పుకున్న రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అధికారంలోకి వచ్చే పార్టీకి కాస్తో కూస్తో మెజారిటీ వచ్చే అవకాశం మాత్రమె ఉంది. కానీ, తమిళనాడు ఎన్నికలకు సంబంధించి వస్తున్న ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో చాలా విస్పష్టంగా డీఎంకే పార్టీ అధికారాన్ని సాధిస్తుందని తెలుస్తోంది. ఇక్కడ ఉన్న 234 అసెంబ్లీ స్థానాల్లోనూ మేజిక్ ఫిగర్ 118 కంటె కనీసం 50 నుంచి 70 స్థానాలు అంటే.. 165 నుంచి 185 స్థానాల్లో డీఎంకే హవా సాగిందని తెలుస్తోంది. అంటే, ఇక్కడ ఎన్నికలు ఏకపక్షంగా సాగినట్టే అనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం చూస్తే మాత్రం అధికార అన్నా డీఎంకే అధికారానికి చాలా దూరంలో నిలబడిపోయే అవకాశం కనిపిస్తోంది.
టీవీ 9 భారత్ వర్ష ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో తమిళనాడులో అధికార అన్నా డీఎంకే పార్టీకి 75-85 స్థానాలు, డీఎంకే పార్టీకి 143-153 స్థానాలు, ఇతరులకు 2-12 స్థానాలు దక్కే చాన్స్ ఉంది.
కేరళలో మళ్ళీ విజయన్ కే పట్టం..
కేరళ ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్ మళ్ళీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. ఆయన సారధ్యంలోని ఎల్డీఎఫ్ మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశాలున్నాయని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ ఎన్డీఏ ఒక్క సీటు కూడా గెలిచే చాన్స్ లేదని దాదాపుగా అన్ని సర్వేలు చెబుతున్నాయి.
టీవీ 9 భారత్ వర్ష ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కేరళలో ఎల్డీఎఫ్ 70-80, కాంగ్రెస్ + 59-69, బీజేపీ 0-2 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు అంచనా.
పుదుచ్చేరిలో ఎన్డీయేకే మొగ్గు..
పాండిచ్చేరి లో ఎన్డీఏ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మొత్తం స్థానాలు 30 కాగా, మేజిక్ ఫిగర్ కు కావలసిన స్థానాలు 16. అయితే, ఇక్కడ ఏన్డీయే 18 నుంచి 22 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి.
టీవీ 9 భారత్ వర్ష ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కాంగ్రెస్+ 6-10సీట్లూ, బీజేపీ+19-23, ఇతరులు 1-2 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి.
ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్నికల ఫలితాల సరళి ఎలా ఉండొచ్చన్న అంచనాలు వేసిన వివిధ ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఈ లెక్కలు ఇవ్వడం జరిగింది. మే 2 వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు అసలు సంగతి తేలనుంది.