ZP Officer Harassing Woman: ఉద్యోగం కోసం వచ్చిన మహిళను ఓ జిల్లా పరిషత్ అధికారి వేధింపులకు గురిచేశాడు. తన కోరిక తీర్చితేనే ఉద్యోగం కల్పిస్తానని నీచంగా మాట్లాడాడు. దీంతో ఆ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. లాతూర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. జిల్లా పరిషత్‌లో పనిచేసిన బాధితురాలి తండ్రి 2007లో మరణించారు. కారుణ్య నియామకం కింద బాధితురాలి తల్లి ప్యూన్‌గా ఉద్యోగం కోసం ప్రయత్నించింది. అయితే అధికారులు ఒప్పుకోలేదు. ఇంతలో బాధితురాలు టీచర్ పోస్టుకు కావలసిన అర్హతలు సంపాదించింది. కారుణ్య నియామకం కింద తనకు టీచర్‌గా ఉద్యోగం కల్పించాలని జిల్లా పరిషత్ అధికారులను వేడుకుంది.
అయితే అపాయింట్‌మెంట్ ఆర్డర్ జారీ చేయడానికి మొదట్లో డబ్బు డిమాండ్ చేసిన అధికారి చివరికి నీచంగా వ్యవహరించాడు. డబ్బు లేకపోతే తన కోరికను తీర్చాలని ఆ మహిళను వేధించసాగాడు. దీంతో ఆ మహిళ విసుగెత్తి లాతుర్‌లోని శివాజినగర్ పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేసింది. లాతూర్ జిల్లా పరిషత్ అధికారి తనకు రావలసిన ఉద్యోగాన్ని ఇవ్యకుండా కావాలని జాప్యం చేస్తున్నట్లు ఆరోపించింది. అంతేకాకుండా తనన సెక్స్‌వల్ గా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ విషయంపై సదరు అధికారిని సంప్రదించగా అందులో ఏ మాత్రం నిజం లేదని ఆ మహిళ కావాలని తనపై ఆరోపణలు చేస్తుందని ఖండించారు. అయితే చివరికి జిల్లా పరిషత్ అధికారులు ఆ మహిళకు ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు.