ప్రాణం తీసిన ప్రేమ.. నల్గొండ జిల్లాలో పరువు హత్య.. మాట్లాడుదామంటూ ఇంటికి పిలిచి యువకుణ్ని కొట్టిచంపేశారు యువతి కుటుంబసభ్యులు. ప్రియురాలి ఇంటికెళ్లిన సంతోష్‌పై కర్రలతో దాడి చేసి చచ్చేలా కొట్టారు. నమ్మి ప్రియురాలి ఇంటికెళ్లి శవమై తేలాడు ప్రేమికుడు సంతోష్.
నల్గొండ జిల్లాలో మరో పరువు హత్య.. ప్రాణంగా ప్రేమించి గుండెల్లో పెట్టుకున్న ప్రియురాలి ఇంట్లోనే శవమై తేలాడు ప్రియుడు. కాదుకాదు.. కర్రలతో కొట్టి చంపారు ప్రియురాలి పేరెంట్స్.
ఎస్.. ఇదొక ప్రేమ కథాచిత్రం. పరువు కోసం ప్రాణం తీసిన ఓ కుటుంబ కథాచిత్రం. నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం కొప్పోలుకు చెందిన యువతి.. కట్టంగూడి మండలానికి చెందిన సంతోష్.. ఇద్దరూ నల్గొండలో చదువుకునేవారు. హైస్కూల్ ఏజ్‌లోనే ప్రేమలో పడ్డారు. ఒకరి మనసుల్ని మరొకరు ఇచ్చిపుచ్చుకున్నారు.
ప్రేమ వ్యవహారం పేరెంట్స్‌కి తెలిసింది. పెళ్లి గురించి మాట్లాడదాం రమ్మని సంతోష్‌కి ఫోన్ చేసి పిలిచిందా అమ్మాయి. నమ్మాడు.. మనసైన అమ్మాయితో మనువంటే ఏ అబ్బాయికి మాత్రం ఆత్రం ఉండదు..? ఆనందంతో గంతులేసి.. కొప్పోలులో అమ్మాయి ఇంటికెళ్లాడు.
అక్కడ తన ప్రియురాలు లేదు. కానీ… కనుచూపు మేరలో మృత్యువు మాత్రం కనిపించింది. ఒక్కసారిగా విరుచుకుపడ్డారు అమ్మాయి పేరెంట్స్. కర్రలతో విచ్చలవిడిగా కొట్టడంతో నెత్తురోడి అక్కడికక్కడే చనిపోయాడు సంతోష్. ఊరు ఊరంతా చూస్తుండగానే.. ఒక ప్రాణం పోయింది. మృతుడి తల్లిదండ్రులు సూరత్‌లో కల్లు గీత కార్మికులు. తమ కూతుర్ని ప్రేమించాడనే కోపంతోనే.. ఆ కుటుంబం ఈ హత్యకు ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది.