Dowry Harassment: దేశంలో ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ.. మహిళలపై వరకట్న వేధింపుల సంఘటనలు ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ పరిధిలోని మియాపూర్‌లో వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైంది. భర్త, అత్తమామలు, ఆడపడుచు వరకట్న వేధింపులు భరించలేక.. ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణాకి పాల్పడింది. మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌కు చెందిన మల్లారెడ్డి కుమార్తె పావనికి.. మియాపూర్ నివాసి శ్రావణ్ కుమార్ రెడ్డితో గతేడాది వివాహం జరిగింది. అప్పటినుంచి శ్రావణ్ కుమార్ పావని దంపతులు మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజుల నుంంచి తెల్లాపూర్‌లో విల్లా కావాలని.. తన తల్లిదండ్రులకు చెప్పాలంటూ శ్రావణ్ కుమార్ పావనిపై ఒత్తిడి తీసుకువస్తున్నాడు. దీంతో అప్పటినుంచి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.
ఈ క్రమంలో శనివారం సాయంత్రం తన కుటుంబసభ్యులతో మాట్లాడవద్దంటూ శ్రావణ్ కుమార్ పావనితో గొడవపడ్డాడు. అనంతరం ఇంటినుంచి బయటకు వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పావని ఇంట్లో ఫ్యాన్‌కు ఊరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అనంతరం స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పావని కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. శ్రావణ్ కుమార్ రెడ్డి వేధింపుల వల్లే తన కుమార్తె మరణించిందని పావని తండ్రి మల్లారెడ్డి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ పోలీసులు వెల్లడించారు.
Also Read: