యూపీ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే సన్నిహిత సహచరుడు అమర్ దూబే ని యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కాల్చి చంపారు. హిస్టరీ షీటర్ అయిన ఇతనిపై 25 వేల రూపాయల రివార్డు ఉంది. వికాస్ దూబే పర్సనల్ బాడీ గార్డు కూడా అయిన ఇతడ్ని హామీర్ పూర్ లో ఎన్ కౌంటర్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పలు కేసుల్లోనూ నిందితుడైన అమర్ దూబే సదా ఆయుధాలు పట్టుకుని తిరుగుతూ ఉండేవాడని, వికాస్ పరారీలో ఇతని హస్తం ఉందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు దూబే మరో సహచరుడైన ఒకడిని ఫరీదాబాద్ లో అరెస్టు చేశారు. ఈ నగరంలో వికాస్ తన బంధువుల ఇంట్లో దాక్కున్నాడని తెలిసింది. అయితే పోలీసుల రాక గురించి ముందే తెలిసి అక్కడినుంచి పరారయ్యాడు. యూపీ, హర్యానా పోలీసులు సంయుక్తంగా వికాస్ దూబే కోసం మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ గాలిస్తున్నారు.
వికాస్ దూబే పై రివార్డును పోలీసులు రెండున్నర లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. అటు-ఢిల్లీ లోని ఓ హోటల్ వద్ద ఇతని పోలికలతో ఉన్న ఓ వ్యక్తి సీసీటీవీ ఫుటేజీలో కనిపించాడు. ఈ ఫుటేజీని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.