Jwalapur MLA Suresh Rathore: ఉత్తరాఖండ్ జ్వాలాపూర్ బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదైంది. నియోజకవర్గంలోని బేగంపురా గ్రామానికి చెందిన బీజేపీ మహిళా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీజేపీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్‌పై శుక్రవారం అత్యాచారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కోర్టు ఆదేశాలతో.. జ్వాలాపూర్ సురేష్ రాథోడ్ పై ఐపీసీ సెక్షన్ 376, 504,506, సీఆర్ పీసీ యాక్ట్ 156(3) ల కింద అత్యాచారం, క్రిమినల్, బెదిరింపులు కేసులు నమోదు చేసినట్లు హరిద్వార్ సీనియర్ పోలీసు అధికారి అబుదాజ్ కృష్ణరాజ్ వెల్లడించారు. కొన్ని నెలల క్రితం ఎమ్మెల్యే రాథోడ్ తనపై అత్యాచారం చేశాడని పార్టీ మహిళ కార్యకర్త ఆరోపించింది. అయితే.. ఆ సమయంలో ఎమ్మెల్యే బెదిరించడంతో దీనిపై ఫిర్యాదు చేయలేదని.. తనకు న్యాయం చేయాలని కోర్టు మెట్లెక్కింది. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
అత్యాచారం కేసు నమోదైన అనంతరం బీజేపీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్ మీడియాతో మాట్లాడారు. తన జీవితం ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. తాను ఈ విషయాన్ని ముందే చెప్పానని.. కొంతమంది.. కావాలనే తనపై కుట్ర పన్ని తప్పుడు కేసు పెట్టించారన్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేసి అసలు వాస్తవాలు బయట పెట్టాలని రాథోడ్ కోరారు. కాగా.. బీజేపీ ఎమ్మెల్యే రాథోడ్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Also Read: