Mahant Narendra Giri: అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి మహరాజ్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ఉన్న బాఘంబరి మఠంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. 5 పేజీల సూసైడ్ నోట్‌ను కూడా రాశారు స్వామీజీ . తన శిష్యులలో ఒకరైన ఆనంద్ గిరి ఇందుకు బాధ్యుడుగా మహంత్ నరేంద్ర గిరి అందులో పేర్కొన్నారు. ఫోరెన్సిక్ బృదంతో పాటు ఒక ప్రత్యేక బృందం ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించింది. మానసిక సమస్యలతో పాటు శిష్యుల వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్ లెటర్‌లో రాశారు నరేంద్రగిరి.
నరేంద్రగిరి సూసైడ్ నోట్ ఆధారంగా ఆయన శిష్యుడు ఆనంద్‌గిరిని ఉత్తరాఖండ్ లోని హరిద్వార్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తనకు ఏం పాపం తెలియదని , స్వామీజీ ఆత్మహత్య చేసుకోలేదని , హత్య చేశారని ఆరోపించారు ఆనంద్‌గిరి. దీంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా హత్య చేసి ఉంటే, ఆ నోట్ ఎవరు రాశారని పోలీసులు ఆరా తీసే అవకాశం ఉంది. అటు నరేంద్రగిరి నోట్‌లో చెప్పినట్టు మానసిక సమస్యలు ఉంటే, వాటిని కూడా నిర్థారించుకునేందుకు ప్రయత్నిస్తారు పోలీసులు. దీంతో ఈ కేసు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.
మరోవైపు మహంత్ నరేంద్ర గిరి ఇక లేరనే వార్త విషాదం నింపినట్టు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
अखाड़ा परिषद के अध्यक्ष श्री नरेंद्र गिरि जी का देहावसान अत्यंत दुखद है। आध्यात्मिक परंपराओं के प्रति समर्पित रहते हुए उन्होंने संत समाज की अनेक धाराओं को एक साथ जोड़ने में बड़ी भूमिका निभाई। प्रभु उन्हें अपने श्री चरणों में स्थान दें। ॐ शांति!!
— Narendra Modi (@narendramodi) September 20, 2021
ఇదిలావుంటే, నరేంద్రగిరి మహారాజ్ ఆత్మహత్య కేసులో నిందితుడైన అతని శిష్యుడు ఆనంద్ గిరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రయాగ్‌రాజ్‌లోని బాఘంబరి మఠం నివాసంలో మహంత్ నరేంద్రగిరి శవమై కనిపించారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే అఖాడా పరిషత్ చీఫ్ తన శిష్యులలో ఒకరైన ఆనంద్ గిరిని అతని మరణానికి బాధ్యుడిగా సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. మహంత్ ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణతో ఆనంద్ గిరిని ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆశ్రమంలో కోట్లాదిరూపాయలను మోసం చేసిన కొందరు వ్యక్తుల పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.