UP Toxic Liquor Tragedy: ఉత్తర ప్రదేశ్‌లో జోరుగా కల్తీ మద్యం.. 35కు చేరిన మృతుల సంఖ్య.. మరో 14 మంది పరిస్థితి విషమం..!

ఉత్తరప్రదేశ్‌లో కల్తీ మద్యం కాటుకు బలైనవారి సంఖ్య 35కు చేరింది. అస్వస్థతకు గురైన మరో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పోలీసులు తెలిపారు.

UP Toxic Liquor Tragedy: ఉత్తర ప్రదేశ్‌లో జోరుగా కల్తీ మద్యం.. 35కు చేరిన మృతుల సంఖ్య.. మరో 14 మంది పరిస్థితి విషమం..!
Up Toxic Liquor Tragedy

Updated on: May 29, 2021 | 4:01 PM

Uttar Pradesh Toxic Liquor Tragedy: ఉత్తరప్రదేశ్‌లో కల్తీ మద్యం కాటుకు బలైనవారి సంఖ్య 35కు చేరింది. అస్వస్థతకు గురైన మరో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. అలీగఢ్‌లోని కార్సియాలోని ఒకే యజమానికి చెందిన రెండు దుకాణాల నుంచి మద్యాన్ని కొనుగోలు చేసి సేవించి తాగిన వారంతా అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి వీరంతా మద్యం సేవించగా.. శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటి వరకూ ఈ ఘటనలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుకాణంలో మద్యం కొనుగోలు చేసి సేవించిన ఇద్దరు ట్రక్కు డైవర్లు కొద్దిసేపటికే అస్వస్థతకు గురై చనిపోయారు. ఆ తర్వాత ఒకరొకరుగా ఆసుపత్రి పాలయ్యారు.

వీరు అలీగఢ్-తప్పాల్‌ జాతీయ రహదారి పక్కన గ్యాస్‌ డిపో వద్ద ట్రక్కు ఆపి మద్యం సేవించారు. కర్సియా, దాని చుట్టు ప్రక్కన గ్రామాలకు చెందిన పలువురు కల్తీ మద్యం సేవించి మృత్యువాత పడ్డారు. కల్తీ మద్యం ఘటనలో తమకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకూ 22 మంది చనిపోయినట్టు అలీగఢ్ మెజిస్ట్రేట్ సీబీ సింగ్ తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఆరుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. కాగా, నిందితులు ప్రభుత్వం నుంచి దుకాణాలకు లైసెన్స్ తీసుకుని మూడు గ్రామాల్లో నాటుసారా నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

అలాగే, ఈ ఘటనలో జిల్లా ఎక్సైజ్ అధికారి సహా ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ యూపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘ఇప్పటి వరకూ ఆరుగుర్ని అరెస్ట్ చేశాం.. వీరిపై మూడు వేర్వేరు ఎఫ్ఐఆర్‌లు నమోదుచేశాం.. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.. వారి గురించి ఆచూకీ చెప్పినవారికి రూ.50,000 రివార్డు ప్రకటించాం.. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి రిజిస్టర్లు, బుక్‌లెట్స్, బ్యాంకు ఖాతాల వివరాలు, మద్యం స్వాధీనం చేసుకున్నాం’’ అని అలీగఢ్ ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్టర్ సహా మరో 12 మందిపై కేసు నమోదుచేశారు. కాగా, ఈ ఘటనకు సంబందించి పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్ సీబీ సింగ్ అధికారులను ఆదేశించారు. ఈ చావులకు స్థానిక అధికార యంత్రాంగమే కారణమని ఈ విషాదంలో సోదరుడ్ని పోగొట్టుకున్న ఓ వ్యక్తి ఆరోపించారు.

యూపీలో తరుచూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలోనూ బులంద్‌షహర్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజుల కిందట హథ్రాస్ జిల్లాల్లో 85 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. 1,700 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ ప్రహార్‌లో భాగంగా యూపీ అధికారులు ఈ చర్యలు చేపట్టారు.

Read Also..  Karimnagar TRS Meeting: టీఆర్ఎస్ కార్యకర్తలతో ఎమ్మెల్సీ నారదాసు సమావేశం.. ఈటల అనుకూల వ్యతిరేకవర్గాల వాదులాట..!