
హైదరాబాద్ కల్తీ కల్లు ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరికి సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు హైదరాబాద్‌లో కల్తీ కల్లు బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిన్నటివరకూ కల్తీ కల్లు బాధితులు 38మంది ఉండగా.. ఇవాళ ఆసంఖ్య 51కి చేరింది. గాంధీ ఆస్పత్రిలో 15 మంది బాధితులకు చికిత్స కొనసాగుతోంది. నిమ్స్‌లో 34 మంది కల్తీ కల్లు బాధితులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. నిమ్స్‌లో ఆరుగురికి డయాలసిస్ చేస్తున్నారు వైద్యులు. ESIలో ఒకరు, ప్రైవేట్ ఆస్పత్రిలో మరొకరికి చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కల్తీ కల్లు తాగి ఆరుగురు మృతి చెందారు.
కల్తీ కల్లు ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు ఎక్సైజ్‌శాఖ అధికారులు. పలు కల్లు దుకాణాల్లో శాంపిల్స్ సేకరించింది ఎక్సైజ్‌శాఖ. శాంపిల్స్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు అధికారులు. 7 కల్లు దుకాణాల లైసెన్స్ రద్దు చేశారు. మోతాదుకు మించి ఆల్ఫ్రాజోలం కలపడంతోనే..ఈ ఘటన జరిగినట్టు ఎక్సైజ్ శాఖ నిర్థారించింది. నగరంలో మొత్తం 97 కల్లు కాంపౌండ్లు ఉండగా.. వాటిలో 50కి పైగా కల్లు దుకాణాలు అక్రమంగా నడుస్తున్న ట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది.
కల్తీ కల్లు ఘటనలో రేవంత్ సర్కార్ టార్గెట్‌గా బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు గుప్పిస్తున్నాయి. బాధితులు పెరుగుతున్నా.. ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కల్తీ కల్లు ఘటన బాధాకరమని.. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఒక్కో కుటుంబానికి 20 లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అటు.. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరామర్శించారు.
కల్తీ కల్లుతో అమాయకుల ప్రాణాలు పోతున్నా సీఎం రేవంత్ ఎందుకు స్పందించడంలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. పేదలంటే సీఎం రేవంత్‌కు అంత చులకనా?.. అంటూ మండిపడ్డారు. కల్తీ కల్లు ఘటనల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ఆయన.. ఎక్సైజ్ శాఖ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు.
ఇక నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ కల్లు బాధితులను మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. కల్తీ కల్లు ఘటనలో బాధ్యులపై చర్యలు కొనసాగుతున్నాయని.. కల్లు కాంపౌండ్లలో తనిఖీలు ముమ్మరం చేస్తామని తెలిపారు.