ఓనం వేళ.. అమెరికాలో ఇద్దరి హత్య! వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
US Malayali Women Murder 2026 : అమెరికాలోని కాలిఫోర్నియాలో కేరళకు చెందిన ఇద్దరు టీచర్లు అంజన హరి, అన్ మేరీ మాథ్యూ హత్యకు గురయ్యారు. వీరితో పాటే ఒకే ఇంట్లో ఉంటున్న మరో మహిళే ఈ హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించి, ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఈ హత్యలు జరగడానికి కొద్ది రోజుల ముందే వీరు ముగ్గురూ కలిసి ఎంతో సంతోషంగా ‘ఓనం’ పండుగను జరుపుకున్నారు. అంతలోనే ఇలాంటి దారుణం జరగడాన్ని మృతుల కుటుంబ సభ్యులు నమ్మలేకపోతున్నారు.
ఆగస్టు 28వ తేదీన కాలిఫోర్నియాలోని మిలిపిటాస్ లో కేరళకు చెందిన ఇద్దరు మహిళా టీచర్లు అంజన హరి, అన్ మేరీ మాథ్యూ దారుణ హత్యకు గురయ్యారు. తోటి మహిళే ఈ హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరు ముగ్గురూ కలిసి ఒకే ఇంట్లో నివసించేవారు. వీరి మధ్య గొడవ జరిగిందా? హత్యకు దారి తీసిన కారణాలేంటి? దర్యాప్తు చేపట్టారు పోలీసులు త్వరలో డీటైల్స్ బయటపెడతామని తెలిపారు.
ఈ దారుణం జరగడానికి కొద్ది రోజుల ముందే వీరంతా ఎంతో సంతోషంగా ‘ఓనం’ పండుగను జరుపుకొని ఆ ఫోటోలను కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. అంతలోనే ఈ ఘోరం జరగడంతో కేరళలోని వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
కారును పైకి ఎక్కించి ఒకరిని, కత్తితో పొడిచి మరొకరిని..!
పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలు అంజన హరి స్వస్థలం త్రిస్సూర్ జిల్లా కాగా, ఆన్ మేరీ మాథ్యూ సొంతూరు తిరువనంతపురం జిల్లా. మిల్పిటాస్‌లోని మిల్ క్రీక్ అపార్ట్‌మెంట్ పార్కింగ్ స్థలానికి అంజనను పిలిపించి, ఆమె పైకి కారు ఎక్కించి, అనంతరం దారుణంగా కొట్టి చంపినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఒక నీలి రంగు ఎస్‌యూవీ (SUV) వాహనం అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయిందని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు చెప్పారు. మరో దారుణ ఘటనలో అన్ మేరీ మాథ్యూను అపార్ట్‌మెంట్‌లోని గదిలోనే కత్తితో పొడిచి హత్య చేశారు.
పోలీసుల కస్టడీలో రూమ్‌మేట్ అనిలా బేబీ
రోడ్డుపై మహిళ మృతదేహం పడి ఉన్నట్లు సమాచారం అందుకున్న మిల్పిటాస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పార్కింగ్ ప్రాంతంలో తీవ్ర గాయాలతో పడి ఉన్న అంజనను గుర్తించి, సాక్షుల ఆధారంగా గాలించి నీలి రంగు ఎస్‌యూవీ కారుతో పాటు దాని డ్రైవర్ 32 ఏళ్ల అనిలా బేబీని అరెస్ట్ చేశారు.
కొట్టాయం జిల్లా ఈరట్టుపేటకు చెందిన మహిళగా అనిలా బేబీని గుర్తించారు. మృతులు ఇద్దరితో ఒకే ఇంట్లో కలిసి ఉన్న ఆమే, ముందస్తు ప్లాన్ ప్రకారమే ఈ రెండు హత్యలు చేసినట్లు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘోరానికి అసలు కారణాలు ఏమిటనేది పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
ఈ విషాద సంఘటనతో కేరళలోని మృతుల కుటుంబాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసాయి. అంజన 2021లో అమెరికాకు వెళ్లి స్కూల్ టీచర్‌గా స్థిరపడ్డారు. ఆమె భర్త సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఆమెకు ఆరేళ్ల కుమార్తె ఉంది. మరో మృతురాలు అన్ మేరీ కూడా టీచర్ గా పనిచేస్తుండగా ఆమెకు భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
శాన్ ప్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం అధికారులను కేంద్ర మంత్రి సురేష్ గోపీ సంప్రదించారు. పోస్టుమార్టం పూర్తయిన వెంటనే చట్టపరమైన ప్రక్రియలు అన్నీ పూర్తి చేసి వారం రోజుల్లోగా భౌతికకాయాలను కేరళకు తరలిస్తామని బాధితుల కుటుంబాలకు హామీ ఇచ్చారు. కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ బాధితుల కుటుంబాలను పరామర్శించారు.