
మూడంతస్తుల భవనం..ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. అందరూ చూస్తుండగానే..నిలువునా నేలకూలింది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
మిద్నాపూర్ జిల్లాలోని దాస్పూర్ గ్రామంలో ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది. పేకమేడలా ఉన్నట్టుండి భవనం తెల్లవారుజామున నేలకూలింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు చెప్పారు. అయితే, ఇంటి ముందు భాగంలో పెద్ద ఎత్తున కాలువ తవ్వడం వల్ల భవనం కూలిపోయిందని అంటున్నారు.. భవనం కూలిపోతున్నసమయంలో అక్కడున్న వారు కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయటంతో.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.