దేశ రాజధానిలో విషాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఐఐటీ ఆవరణలో ముగ్గురి ఆత్మహత్య కలకలం రేపింది. ఓ ఫ్లాట్‌లో నివాసముంటున్న ల్యాబ్ టెక్నీషియన్ కుటుంబంలో ముగ్గురు సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిని ల్యాబ్ టెక్నీషియన్ గుల్షన్‌దాస్, భార్య సునీత, తల్లి కాంతలుగా గుర్తించారు. వేర్వేరు గదుల్లో సీలింగ్ ఫ్యాన్లకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తలుపులు పగులగొట్టి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కాగా, గుల్షన్ దాస్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వివాహమైంది. అయితే వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదని.. ఘటనాస్థలంలో ఎలాంటి లేఖ కూడా లభించలేదని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.