నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలను విక్రయిస్తున్న ముఠాకు రాచకొండ పోలీసులు చెక్ పెట్టారు. పేలుడు పదార్థాలను తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రెండు వాహనాల్లో మొత్తం 8900 కిలోల పేలుడు పదార్ధాలు (376 బూస్టర్స్), మరో వాహనంలో 165 ఎలక్ట్రిక్ డిటోనేటర్స్‌ను గుర్తించారు. పేలుడు పదార్థాలతో పాటు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
వివరాల్లోకి వెళితే.. కీసర సీఐ జె.నరేందర్‌గౌడ్ కథనం ప్రకారం.. యాదాద్రి-భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రంలో రీజెనసిస్ అనే పేలుడు పదార్థాలకు సంబంధించిన కంపెనీ ఉన్నది. ఈ కంపెనీ నుంచి లైసెన్స్ కలిగిన వారికి మాత్రమే పేలుడు పదార్థాలను సరఫరా చేస్తుంటారు. మల్లారం గ్రామానికి చెందిన శ్రావన్‌రెడ్డి, సిద్దిపేట్‌కు చెందిన నారాయణలు ఈ పేలుడు పదార్థాలకు సంబంధించిన లైసెన్స్ కలిగి ఉన్న వ్యక్తులు. వీరికి ఈ పేలుడు పదార్థాలను విక్రయించేందుకు డీలర్‌షిప్ కూడా ఉన్నది. అయితే బొమ్మలరామారం నుంచి ఈ పేలుడు పదార్థాలను కొనుగోలు చేసి తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. అయితే వీరిద్దరూ కలిసి ఈ పదార్థాలను అక్రమంగా విక్రయించడం ప్రారంభించారు. బొమ్మలరామారం నుంచి కొనుగోలు చేసిన పేలుడు పదార్థాలను కీసర మండలం వన్నీగూడలోని హర్ష స్టోన్ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా వీరు విక్రయిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. పక్కా ప్లాన్‌తో వీరికి చెక్ పెట్టారు. రంగంలోకి దిగిన ఎస్‌వోటీ పోలీసులు..పేలుడు పదార్థాలను తరలిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని కీసర పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటికే శ్రావన్‌రెడ్డి, నారాయణలను అదుపులోకి తీసుకొన్నారు.