Telangana: పోలీసులు ఎన్ని రకాల చర్యలు చేపడుతోన్న నేరాలు మాత్రం ఆగడం లేవు. పోలీసులు నిఘా నేత్రాలను తప్పించుకొని అక్రమార్కులు నేరాలకు పాల్పడుతున్నారు. గురువారం తెలంగాణలోని కోదాడ పట్టణంలో వెలుగు చూసిన స్మగ్లింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర పుణేకు చెందిన సుభాష్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని అరకు నుంచి గంజాయి అక్రమంగా తరలిస్తున్నాడు. ఇన్నోవా కారులో దర్జాగా గంజాయిను తరలిస్తుండగా.. కోదాడ పట్టణ పోలీసులు తనిఖీల్లో భాగంగా కారును ఆపి చూడగా గంజాయి కనిపించింది. దీంతో పోలీసులు విచారించగా సుభాష్ నేరాన్ని అంగీకరించి పూర్తి వివరాలు తెలిపాడు.
పుణేకు చెందిన ఆకాష్ ఉత్తమ్ రావు చౌహాన్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌ను నుంచి గంజాయి తీసుకొని వస్తే రూ. 10 వేలు ఇస్తానని ఆశ చూపానని అందుకే తాను ఈ పని చేశానని సుభాష్ పోలీసులకు తెలిపాడు. నిందితుడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 21 లక్షలు ఉంటుందని అంచనా. ఇక అసలు నేరస్థుడు ఆకాష్ ఉత్తమ్ రావు చహాన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నేరస్తుడి నుంచి గంజాయి, సెల్ ఫోన్, ఇన్నోవా కారు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
పోలీసులకు దొరికి సుభాష్ పుణేలోని ఓ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. అయితే విద్య పూర్తయిన తర్వాత ఉద్యోగం రాకపోవడంతో కారు డ్రైవర్‌గా మారాడు. డ్రైవర్‌గా వచ్చే సంపాదనతో కుటుంబాన్ని పోషించలేకపోవడంతో సుభాష్ అడ్డదారి తొక్కాడు. ఎక్కువ డబ్బు ఇస్తానని ఆశ చూపడంతో గంజాయి స్మగ్లింగ్‌లోకి దిగి కటకటాల పాలయ్యాడు. ఇలా మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తి అత్యాశతో దొంగ మార్గాన్ని ఎంచుకున్ని ఇప్పుడు ఓ నేరస్థుడిగా మిగిలిపోయాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..