Saidabad Rape case Accused: హైదరాబాద్ నగరంలో సంచలన సృష్టించిన రేపిస్ట్ రాజు కేసు అప్పుడే ముగిసిపోలేదు. రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్న రాజు మృతిని హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది హైకోర్టు. వరంగల్ మూడో మెజిస్ట్రేట్ ఈ కేసును విచారణ జరపాలను ఆదేశాలు జారీచేసింది. నాలుగు వారాల్లో సీల్డ్ కవర్‌లో ఈ నివేదిక సమర్పించాలంది ఉన్నత న్యాయస్థానం. అయితే రాజు ఆత్మహత్య చేసుకున్నాడని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నివేదిక అందించింది. ఇప్పటివరకు ఏడుగురు సాక్షులను విచారించామన్నారు తెలంగాణ అడ్వకేట్ జనరల్ BS ప్రసాద్. పోస్ట్‌మార్టమ్‌ను కూడా వీడియోగ్రఫీ చేశామన్నారు. ఈ వీడియోగ్రఫీతోపాటు.. పోస్టుమార్టమ్ నివేదికను రేపు రాత్రి 8 గంటలలోపు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిని చిదిమేసిన కేసు నిందితుడు రాజు ఆత్మహత్యపై విచారణ జరిపించాలని హైకోర్ట్‌లో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ లక్ష్మణ్ ఈ పిటిషన్ వేశారు. అత్యవసరంగా పిటిషన్ విచారించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ స్వీకరించిన ధర్మాసనం మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారించేందుకు అనుమతించింది. దీంతో విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలావుంటే, ఆరేళ్ల చిన్నారిపై చాక్లెట్ల ఆశజూపి అఘాయిత్యానికి పాల్పడ్డాడు రాజు, ఆపై బాలికను అతి కిరాతకంగా హతమార్చాడు. అనంతరం స్నేహితుడి సహాయంతో అక్కడి నుంచి పారిపోయి వారం రోజులపాటు రాష్ట్ర పోలీసులకు చుక్కలు చూపించాడు. ఇటు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు నిందితుడిని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేట్టాయి. ఈ క్రమంలో జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ కిందపడి గురువారం ఉదయం రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం డెడ్‌బాడీని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఇది సూసైడ్ కాదని హత్యేనని ఆరోపించారు. ఈ క్రమంలోనే పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ లక్ష్మణ్ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. ఆత్మహత్యపై విచారణ జరిపించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.