Beaten up Former MP: మద్యం మత్తులో తెలియకుండానే తప్పులు జరిగిపోతుంటాయి. తాజాగా ఓ మాజీ పార్లమెంటు సభ్యుడికి లిక్కర్ విపరీతమైన డ్యామేజ్ చేసింది. పీకల దాకా మద్యం తాగి, ఇంటికి రాకుండా పొరపాటున పక్కింటికి వెళ్లిన వ్యక్తుల గురించి విన్నాం.. లేదంటే ఎక్కడొక చోట పడిపోయి పొద్దున్నే లేచి వెళ్లిన ఘటనలకు సంబంధించి విన్నాం. తాజాగా ఇలాంటి ఘటననే తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఫుల్‌గా మద్యం తాగి ఇతరుల ఇంటికి వెళ్లిన ఓ వ్యక్తిని ఆ ఇంటి యజమాని చితక బాదాడు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆ వెళ్లిన వ్యక్తి అందరిలా సాధారణ వ్యక్తి కాదు. ఓ పేరున్న రాజకీయ నాయకుడు కావడం విశేషం. విషయం తెలిసేలోపే సదరు వ్యక్తిని స్థానికులంతా కలిసి చిత్తడి చేశారు. అయితే, గాయపడిన మాజీ ఎంపీ సైతం తనపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారని చెప్పడం కొసమెరుపు.
అన్నాడీఎంకే మాజీ ఎంపీ గోపాలకృష్ణన్ దీపావళి పండుగ రోజు ఫుల్‌గా లిక్కర్ సేవించారు. ఆయనకు మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. ఇదే క్రమంలో మదురై నీలగిరి ముత్యాలమ్మన్‌పేట్‌లోని ఓ నివాసంలోకి ప్రవేశించారు. దీనితో ఆయన ప్రవర్తనపై ఆగ్రహించిన ఇంటి ఓనర్.. గోపాలకృష్ణన్‌పై దాడి చేశాడు. స్థానికులతో కలిసి చితకబాదాడు. అంతేగాక ఈ ఘటనను సెల్ఫోన్లో రికార్డు చేశాడు. అనంతరం కూనూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారని, అతను అర్థ నగ్నంగా వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేశాడని ఇంటి యజమాని పోలీసులకు తెలిపాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనలో గోపాలకృష్ణన్‌కు స్వల్పంగా గాయాలు కూడా అయ్యాయి.
అయితే, తమతో అనుచితంగా ప్రవర్తించడం వల్లే దాడి చేశామని.. ఆయన మాజీ ఎంపీ అని తెలియదని పేర్కొన్నారు. అనంతరం ఆయనను కూనూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని పోలీసులతో పేర్కొనడం గమనార్హం.
Read Also… Viral Video: తల్లి జీబ్రా సాహసం.. సింహాన్ని వెనుక కాళ్లతో తన్నుతూ.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు.!