Software Engineer Suicide: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడింది. చికిత్స కోసం మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో యువతి మరో నాలుగైదు గంటల్లో ఇంటికి వెళ్లాల్సి ఉండగా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం నగరంలో కలకలం రేపింది. ఈ మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజేంద్రనగర్ సీఐ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ నెల్లూరుకు చెందిన సుదీప్తి (27) హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంది. ఆమె బండ్లగూడజాగీర్‌లోని అపార్ట్‌మెంట్లో ఉంటూ విధులకు హాజరవుతోంది. ఈ క్రమంలో ఈ నెల 6న అనారోగ్యంతో స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. మూడు రోజులుగా ఆమె చికిత్స తీసుకుంటూ పూర్తిగా కోలుకుంది.
మంగళవారం మధ్యాహ్నం డిశ్ఛార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో ఉదయం 9గంటల సమయంలో ఆమెను పరిశీలించేందుకు నర్సు ఆమె గది దగ్గరకు వెళ్లింది. ఈ సమయంలో లోపలి తలుపు గడి పెట్టుకొని ఉండటంతో ఆమె ఆసుపత్రి సిబ్బందికి సమాచారమిచ్చింది. అనంతరం సిబ్బంది తలుపు బద్దలు కొట్టి లోపలికెళ్లి చూడగా.. సుదీప్తి ఫ్యానుకు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆసుపత్రి నిర్వాహకులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకొని.. వివరాలు సేకరించారు.
యువతి తల్లి బెంగళూరులో ఆమె సోదరుడి దగ్గర ఉంటోందని వారికి సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. కాగా.. యువతి ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడిందో తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: