Sister Suicide for Cell Phone: సెల్ ఫోన్ విషయంలో తలెత్తిన ఓ వివాదం ఏకంగా బాలిక ప్రాణాలే బలిగొన్నది. సెల్‌ఫోన్ కోసం అక్కతమ్ముడు మధ్య జరిగిన ఘర్షణ అక్క ప్రాణం తీసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. తల్లాడ మండలంకు చెందిన 15ఏళ్ల బాలిక ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పదవ తరగతి చదువుతుంది. లాక్‌డౌన్ కారణంగా పాఠశాలలన్నీ మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే క్లాసులు ఉండటంతో సెల్ ఫోన్, ఇయర్ ఫోన్స్ కొనిచ్చారు తల్లిదండ్రులు.
అయితే, ఇదే క్రమంలో తమ్ముడికి, అక్కకు మధ్య సెల్‌ఫోన్ విషయంలో గొడవ జరిగింది. ఈ ఘర్షణ కాస్త బాలిక ప్రాణాలు పోయే పరిస్థితికి తెచ్చింది. తమ్ముడితో జరిగిన కొట్లాటతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక.. క్షణికావేశంలో ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఊరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు గమనించేలోపే బాలిక ప్రాణాలు గాలిలో కలిశాయి. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు తల్లాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలిక మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.