Goa Beach: గోవా బీచ్‌లో అర్ధనగ్నంగా మహిళ మృతదేహం.. హత్యేనంటున్న కుటుంబీకులు, మహిళా సంఘాలు

|

Aug 17, 2021 | 12:03 PM

గోవా బీచ్‌లో ఇటీవల ఓ యువతి మృతదేహం లభ్యంకావడం కలకలంరేపుతోంది. ఆ యువతి మరణంపై ఆమె కుటుంబీకులు, సన్నిహితులు, మహిళా సంఘాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి.

Goa Beach: గోవా బీచ్‌లో అర్ధనగ్నంగా మహిళ మృతదేహం.. హత్యేనంటున్న కుటుంబీకులు, మహిళా సంఘాలు
Goa Beach (Representative Image)
Follow us on

Goa Beach: గోవా బీచ్‌లో ఇటీవల ఓ యువతి మృతదేహం లభ్యంకావడం కలకలంరేపుతోంది. ఆ యువతి మరణంపై ఆమె కుటుంబీకులు, సన్నిహితులు, మహిళా సంఘాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. గోవాలోని ప్రసిద్ధ కలంగుటె బీచ్‌లో ఈ నెల 12న అర్ధనగ్నంగా యువతి మృతదేహం లభ్యమయ్యింది. సముద్రనీటిలో మునిగి ఆమె మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదవశాత్తు ఆమె సముద్రనీటిలో పడి చనిపోయి ఉండొచ్చు లేదా సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చన్న వాదన వినిపిస్తున్నారు పోలీసులు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఆమెపై లైంగిక దాడి లేదా భౌతిక దాడి జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని పోలీసులు తెలిపారు. అయితే ఆ యువతి మరణంపై ఆమె కుటుంబీకులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.  ఎవరో ఆమెపై లైంగిక దాడికి పాల్పడి సముద్రనీటిలో తోసి హతమార్చినట్లు ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తంచేయగా..వారికి గ్రామస్థులు, మహిళా సంఘాలు, రాజకీయ కార్యకర్తలు బాసటగా నిలిచారు. గోవాలో సోమవారం రాత్రి వారు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఆ యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

యువతిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని చెబుతున్న పోలీసులు… మృతదేహం అర్ధనగ్నంగా ఎందుకు ఉందో చెప్పాలని కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న మహిళా సంఘాల ప్రతినిధులు ప్రశ్నించారు. సహజంగా సముద్రంలో కొట్టుకుపోయి చనిపోతే వారి మృతదేహంపై దుస్తులు అలాగే ఉంటాయన్నారు. మరి ఆ యువతి ఏదైనా కారణంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావించినా… దుస్తులు తీసేసి ఎవరూ సముద్రనీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడరు కదా అని ప్రశ్నిస్తున్నారు. యువతి మృతదేహం అర్ధ నగ్నంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆమె అనుమానాస్పద మరణంపై సమగ్ర విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గుతేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఉత్తుత్తి దర్యాప్తు కాకుండా ఆ యువతి సంచరించిన ప్రాంతాలు, రోడ్లపై ఉన్న సీసీటీవీ ఫూటేజీల ఆధారంగా లోతైన దర్యాప్తు జరపాలని కోరారు.

Goa beach

గతంలోనూ 2008లో బ్రిటీష్ టీనేజర్ గోవా బీచ్‌లో సముద్రనీటిలో కొట్టుకుపోయి మృతి చెందినట్లు పోలీసులు ప్రాధమిక విచారణలో తెలిపారు. ఆ మేరకు ఆమెది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులు తొలుత కేసు నమోదుచేశారు. అయితే ఆ తర్వాత దర్యాప్తులో ఆమెది హత్యగా నిర్ధారణ అయ్యింది. శ్యాంసన్ డిసౌజా అనే వ్యక్తి ఆమెకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడి.. ఆ తర్వాత ఆమెను హతమార్చినట్లు నిర్థారించిన బాంబే హైకోర్టు పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ 2019లో సంచలన తీర్పు ఇచ్చింది.

నార్త గోవాకు చెందిన ఆ యువతి ఆఫీస్‌కు వెళ్లేందుకు తండ్రి ఆమెను మపుసా బస్టాండ్‌లో డ్రాప్ చేయగా..ఆ తర్వాత ఆమె ఇంటికి తిరిగిరాలేదు. యువతి కనిపించకుండా పోయినట్లు కుటుంబీకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు(ఆగస్టు 12) ఉదయం 6 గంటలకు ఆమె మృతదేహం గోవా బీచ్‌లో లభ్యమయ్యింది. అటు వైపు వెళ్తున్న స్థానికులు ఎవరో చూసి గుర్తుతెలియని మృతదేహం బీచ్ దగ్గర పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారమిచ్చినట్లు నార్త్ గోవా ఎస్పీ శోబిత్ సక్సేనా మీడియాకు తెలిపారు.

అటు గోవా బీచ్‌లో యువతి మృతదేహం లభ్యమైన ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. ఈ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. మపుసా పోలీస్ స్టేషన్‌తో పాటు గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తులో పాలుపంచుకుంటున్నట్లు చెప్పారు.

Also Read..

మూడు రోజులుగా ఇంటి ఎదుట డెడ్ బాడితో ఆందోళన..అసలేం జరిగిందంటే..?

జిమ్‏లో మెగాస్టార్‏ను కలిసిన ప్రకాష్ రాజ్.. ఆసక్తికర ట్వీట్ చేసిన విలక్షణ నటుడు..