21-year-old to 35 years in prison : మైనర్ బాలికపై అత్యాచారం చేసి, హతమార్చిన కేసులో తమిళనాడు రాష్ట్రంలోని ప్రత్యేక కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిందితుడికి 35ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2019లో జరిగిన ఘటనపై విచారించిన కోర్టు తీర్పు వెలువరించింది.
సేలం జిల్లాలో ఐదేళ్ల క్రితం ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన 17 యేళ్ల బాలుడికి దిగువ కోర్టు విధించిన 35 యేళ్ల కారాగార శిక్షను సేలం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఖరారు చేశారు. ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని ఆ బాలుడు అపహరించుకెళ్లి అత్యాచారం జరిపి హతమార్చాడు. ఈ కేసుపై సేలం మహిళా న్యాయస్థానం మేజిస్ట్రేట్ విజయకుమారి విచారణ జరిపి బాలుడికి పోక్సోచట్టంతో సహా వివిధ చట్టాల ప్రకారం 35 యేళ్ల జైలు శిక్షను విధిస్తూ 2019లో తీర్పు వెలువరించారు.
అయితే బాలుడికి 21 యేళ్లు వచ్చే వరకూ చెంగల్పట్టు బాలనేరస్థుల కారాగారంలో ఉంచాలని ఆదేశించారు. ఆ బాలుడికి 21 యేళ్లు రాగానే శిక్షను ఖరారు చేయాలని మేజిస్ట్రేట్ తీర్పులో పేర్కొన్నారు. దీంతో ఇటీవల ఆ బాలుడి వయస్సు 21 యేళ్లకు చేరుకోవడంతో పోలీసులు అతడిని సేలం పోక్సోచట్టం నేరాలపై విచారణ జరిపే ప్రత్యేక కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ మురుగానందం నిందితుడి వయస్సు 21 యేళ్లని నిర్ధారించుకున్న తర్వాత మహిళా కోర్టు విధించిన 35 యేళ్ళ జైలు శిక్షను ఖరారు చేశారు. ఆ బాలుడు బాల నేరస్థుల కారాగారంలో గడిపిన కాలాన్ని తగ్గించుకుని మిగతా కాలం జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని తీర్పునిచ్చారు. దీంతో పోలీసులు ఆ బాలుడిని కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
Read Also… కర్ణాటక ముఖ్య నేత బంధువు దారుణ హత్య.. నెల్లూరు జిల్లా అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టిన దుండగులు..!