
Sachin Waze Wanted To Super Cop: ఒకే ఒక్కడు. ఒక మామూలు పోలీస్ ఆఫీసర్. అతడి పేరు సచిన్ వాజే. కానీ ఈ ఒక్కడి చుట్టూ మహారాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, NIA, ED, సిట్. ఇంతమంది వ్యక్తులు, ఇన్ని వ్యవస్థలు ఫోకస్ చేస్తున్నాయంటే “వీడు మామూలోడు కాదు” అనుకోవాల్సిందే. అవును సచిన్ వాజే చుట్టూ ఇంత థ్రిల్లర్ సీరియల్ నడుస్తోందంటే దీని వెనక ఉన్న ఏముంది? ఈయన వెనక ఎవరున్నారు? అన్వేషణ సచిన్ వాజే దాచిన నిజం కోసమా, లేక ఆయన వెనకున్న కనిపించని శక్తులపైనా.. అన్నట్లుగా సాగిన క్రైమ్ థ్రిల్లింగ్ ఎపిసోడ్‌కు ఎండ్ కార్డు దగ్గరకు వచ్చింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 25న రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్ధాలు ఉన్న వాహనాన్ని నిలిపిన కేసులో ముంబై పోలీసు సచిన్ వాజేను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ముకేష్ అంబానీ ఇల్లు యాంటిల్లా ముందు మహింద్ర స్కార్పియో ఆగి ఉంది. అందులో 20 జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయి. అంతేకాదు, ఒక వార్నింగ్ లెటర్ కూడా ఉంది. ఈ స్కార్పియో ఓనర్ మన్‌సుఖ్ హిరేన్ మృతికేసులో సచిన్ వాజేను అరెస్టు చేసిన తర్వాత పరిణామాలు టకటకా మారిపోయాయి. సచిన్ వాజేను అదుపులోకి తీసుకున్న పోలీసులు నెలల తరబడి విచారణ జరిపిన అసలు కూపీ లాగేశారు. దీంతో ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజేనే అని జాతీయ దర్యాప్తు సంస్థ తేల్చేసింది. ‘సూపర్ కాప్’గా తన పాపులారిటీని తిరిగి తెచ్చుకోవాలని, అంబానీని బెదిరించి డబ్బు రాబట్టాలని వాజే ఈ కుట్రంతా పన్నినట్లు వెల్లడించింది.
ఈ కేసులో సచిన్ వాజే సహా మరికొందరిని అరెస్టు చేసిన ఎన్‌ఐఏ ఇటీవల ప్రత్యేక కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ వ్యవహారం మొత్తాన్ని సచిన్ వాజేనే నడిపించినట్లు ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఉగ్రవాదుల పేరుతో ప్రముఖులను భయభ్రాంతులకు గురిచేసి వారి నుంచి భారీగా డబ్బులు దండుకోవాలనేది వాజే ప్లాన్ అని వివరించింది. అంతేగాక, ఇలాంటి కేసులను తానే టేకప్ చేసి ‘సూపర్‌కాప్’గా పాపులారిటీ పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేసినట్లు వెల్లడించింది. మరోవైపు, ఈ కేసులో మరో 9 మంది నిందితులుగా ఉన్నారు.
ఒక మామూలు పోలీసు ఆఫీసర్. 63 మందిని ఎన్‌కౌంటర్ చేసిన Super Cop సచిన్ వాజే.. టెక్నాలజీలో దిట్ట. తీవ్రమైన సైబర్ నేరాలకు వాజే పాల్పడినట్లు ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు. ముంబై పోలీస్ విభాగంలో సెల్‌ఫోన్ ఇంటర్‌సెప్షన్ యూనిట్లు, ఇ మెయిల్ యూనిట్లను స్థాపించింది కూడా ఇతడే. సచిన్ వాజేను పూర్తి ఆధారాలతో దోషిగా తేల్చింది. మిథీ నదిలో సచిన్ వాజేకు సంబంధించిన రెండు CPUలను, ఒక ల్యాప్‌టాప్‌ను, రెండు హార్డ్‌డిస్క్‌లను, క్యాట్రిడ్జ్ పెన్‌డ్రైవ్‌లను పారేశారు. వీటిని దర్యాప్తు సంస్థ సంపాదించింది. ముంబైలో థ్రిల్లర్ సినిమాను తలపించిన ఎపిసోడ్‌కు ఎండ్ కార్డు పడింది.