Kagaznagar Bus Accident: కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పెను రోడ్డు ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సులో డ్రైవర్‌కు ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మూర్చ(ఫిట్స్) రావడంతో స్టీరింగ్‌పైనే కుప్పకూలిపోయాడు. దీంతో బస్సు అదుపు తప్పి పత్తి చేనులోకి దూసుకెళ్లింది. అంతలోనే బస్సు నిలిచిపోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటన కాగజ్‌నగర్ మండలం బోరిగాం సమీపంలోని జరిగింది. కండక్టరు సత్యనారాయణ, పలువురు ప్రయాణికులు తెలిపిన కథనం ప్రకారం.. మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (టీఎస్01యూబీ1196) 50 మంది ప్రయాణికులతో ఈ ఉదయం కాగజ్‌నగర్ బస్టాండ్ నుంచి మంచిర్యాలకు బయలుదేరింది. పట్టణంలోని ప్రధాన రహదారి వినయ్ గార్డెన్ వరకు రాగానే, అక్కడే మూడు డివైడర్లున్నాయి. ఇక్కడ నెమ్మదిగా నడుపుతున్న డ్రైవర్ గణేష్‌కు ఫిట్స్ రావడంతో స్టీరింగ్‌పైనే కుప్పకూలాడు. దీంతో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని నేరుగా పత్తి చేనులోకి వెళ్లింది.
హఠాత్తు పరిణామంతో షాక్ గురైన ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేస్తూ.. కండక్టర్‌తో సహా దిగిపోయారు. దాదాపు వంద మీటర్ల వరకు వెళ్లి సమీపంలోని ఓ మట్టి కాలువలో నిలిచింది. స్తంభం పూర్తిగా ధ్వంసం కాగా, వైర్లు కిందపడ్డాయి. ఆ సమయంలో విద్యుత్తు సరఫరా కూడా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. వెంటనే వారు 108 అంబులెన్సుకు సమాచారం అందించడంతో.. డ్రైవర్‌ను కాగజ్‌నగర్ పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. కాగా, ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.