Adilabad Road Accident: ఆదిలాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. గుడిహత్నూర్ మండల కేంద్రంలోని బస్ స్టాండ్ వద్ద వేగంగా వచ్చిన కంటైనర్ ట్రక్కు.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్, కంటైనర్ డ్రైవర్‌తో పాటు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే బస్సులోని పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డవారిని పోలీసులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గుడిహత్నూర్ బస్ స్టేషన్ నుండి ఆదిలాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో హైవే పైనుండి సర్వీస్ రోడ్డుపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఓవర్ స్పీడే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. దారికి అడ్డంగా ఉన్న ఈ రెండు వాహనాలను క్రేన్ సహాయంతో తొలగించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని 108 వాహనంలో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారని, వారికి స్వల్ప గాయాలు మినహా ఏమి కాలేదని పోలీసులు తెలిపారు. వారిని కూడా ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు.