Balanagar Fly Over: ప్రమాదాలు చెప్పిరావు. ఒక్కోసారి నిబంధనలు అన్నీ పాటించినా మన చిన్నపాటి నిర్లక్ష్యం మరణశాసనాన్ని రాసేస్తుంది. అసలే వేగవంతం అయిన జీవితం. ఉరుకులు పరుగులు తప్పనిసరిగా మారిపోయిన పరిస్థితులు. అలసట, ఒత్తిడి ప్రాణాల మీదకు తెచ్చేస్తున్నాయి. వాహనం నడిపేటప్పుడు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నాసరే అది ప్రాణాంతకం అవుతుంది. మీదకు ఏదైనా వాహనం రావడమో.. మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదానికి గురికావడమో.. లేదా అనుకోకుండా జరిగిన ప్రమాదమో జరిగితేనే ఎంతో బాధగా ఉంటుంది. అటువంటిది నిద్రలేమి వలన జరిగిన చిన్న యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోతే అయ్యో పాపం అనిపిస్తుంది. ఇలా నిద్రలేమి, అలసట తో వాహనాన్ని నడపడం ప్రమాదకరం అనే విషయాన్ని బాలానగర్ ఫ్లై ఓవర్ మీద జరిగిన ప్రమాదం నిరూపిస్తోంది. ఈ ప్రమాదం వీడియోను సైబరాబాద్ పోలీసులు ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..
ఇటీవలే ప్రారంభమైన బాలానగర్ బాబుజగ్జీవన్‌రామ్ ఫ్లైఓవర్ మీదుగా బైకుపై వేగంగా వెళుతూ ఒక యువకుడు ప్రమాదం బారిన పడ్డాడు. బైక్ మీద వెళుతున్న యువకుడు ఒక్కసారిగా అదుపు తప్పి బైక్ తన ఎడమవైపుగా వేగంగా వెళ్లడంతో ఫ్లై ఓవర్ గోడను గుద్దుకున్నాడు. దీంతో అతని తలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. అతనిని 108సహాయంతో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు చెప్పారు. ఈ యువకుడి పేరు అశోక్ (24). ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కుడిదేనా గ్రామానికి చెందిన వాడు. లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కేపీహెచ్‌బీ కాలనీలోని తన సోదరుడు అనిల్ ఇంటికి వచ్చాడు. డ్రైవింగ్ టెస్ట్ కోసం తన బంధువు బైక్ తీసుకుని ఉదయం తిరుమల గిరిలోని ఆర్టీఏ కార్యాలయానికి వెళుతున్నాడు. ఈ క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఇతను హెల్మెట్ పెట్టుకున్నా దాని క్లిప్ పెట్టుకోకపోవడంతో అది ఎగిరి పక్కకు పడిపొయింది. దీంతో తలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. తమ్ముడు అనిల్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ప్రమాదం జరిగిన తీరును సైబరాబాద్ పోలీసులు సీసీ కెమెరాలో రికార్డు అయిన వీడియో ద్వారా ట్విట్టర్ లో షేర్ చేశారు. రెప్పపాటులో బైక్ అదుపు తప్పడం అందులో కనిపిస్తోంది. అవిశ్రాంతంగా వాహనాలు నడపవద్దని ట్రాఫిక్ పోలీసులు ఈ ట్వీట్ ద్వారా ప్రజలకు చెబుతున్నారు. ఈ ప్రమాదం జరిగిన తీరు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ట్వీట్ లో మీరూ చూడొచ్చు ఇక్కడ..
నిద్రలేక పోవడం, అలసటగా ఉంటే బండి నడపకండి.
రాత్రంతా లారీ డ్రైవింగ్ చేసి, తగినంత విశ్రాంతి తీసుకోకుండా బైక్ నడుపుతూ కింద పడి చనిపోయిన బైక్ రైడర్.#RoadSafetyCyberabad #RoadSafety pic.twitter.com/mkYLWOuSjb
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) July 22, 2021
Guntur: గుంటూరు జిల్లాలో బెంజ్ కారు దగ్ధం.. విచారణలో పోలీసులు మైండ్ బ్లాంక్