పెళ్లయిన 4 నెలలకే దారుణం.. గర్భిణీ రక్షణ శాఖ అధికారిణి మృతి!

ఢిల్లీలోని ద్వారకలో విషాద ఘటన చోటుచేసుకుంది. 30 ఏళ్ల గర్భిణీ మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో ఇంట్లో మృతి చెందారు. ఆమె రక్షణ మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఆమె భర్త, అత్తమామలపై మానసిక, శారీరక వేధింపుల ఆరోపణలు చేశారు. మృతురాలిని నాజియా ఖానం‌గా గుర్తించారు. ఆమెకు ఏప్రిల్‌ 11న ఆజం అలీ ఖాన్‌తో వివాహం జరిగింది. పెళ్లయి కేవలం నాలుగు నెలలు మాత్రమే కాగా, ఆమె మూడు నెలల గర్భిణిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు..

పెళ్లయిన 4 నెలలకే దారుణం.. గర్భిణీ రక్షణ శాఖ అధికారిణి మృతి!
Pregnant Defence Ministry Officer Death

Updated on: Aug 23, 2026 | 5:47 PM

ఢిల్లీ, ఆగస్ట్ 23: నాజియా పెళ్లి తర్వాత తన భర్త ఆజం అలీ ఖాన్‌, అత్త సమీన్‌ నిషా, మామ బాబర్‌ అలీ ఖాన్‌ తనను తరచూ వేధించేవారని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం. తనను కొట్టడంతో పాటు ఇంటి నుంచి వెళ్లగొడతామని, చంపేస్తామని కూడా బెదిరించేవారని ఆమె పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. భర్త ప్రవర్తనపై నాజియా పలుమార్లు కుటుంబ సభ్యులకు చెప్పినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని వారు తెలిపారు. ఆగస్టు 21న తెల్లవారుజామున 4 గంటల సమయంలో నాజియా మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే నాజియా కుటుంబ సభ్యులు ఈ వాదనను అనుమానిస్తున్నారు. ఆమెను హత్య చేసి, ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి ఉండవచ్చని వారు ఆరోపించారు. నాజియా తండ్రి తవాబ్‌ ఖాన్‌ తన కుమార్తె మృతికి ఆమె భర్తనే బాధ్యుడిగా పేర్కొని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పోలీసులకు భర్త ఏం చెప్పాడు?

పోలీసుల విచారణలో నాజియా భర్త ఆజం అలీ ఖాన్‌ వేరే వాదన వినిపించినట్లు అధికారులు తెలిపారు. భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగిందని, అనంతరం నాజియా గదిలోకి వెళ్లి తలుపు వేసుకుందని అతడు చెప్పాడు. కొంతసేపటి తర్వాత గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, కిటికీకి నాజియా ఉరివేసుకుని కనిపించిందని పోలీసులకు తెలిపాడు. నాజియా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి సమయం పట్టడంతో ఇప్పటివరకు పోస్టుమార్టం నిర్వహించలేదని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

పోస్టుమార్టం ప్రక్రియను వీడియో రికార్డు చేయాలని, ఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలను భద్రపరచాలని నాజియా కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, ఘటనాస్థలంలో సేకరించిన ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నాజియా మృతికి అసలు కారణం ఏమిటన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us