Hyderabad: భారీ అగ్నిప్రమాదం.. మంటల దాటికి ఆరు ఫర్నిచర్ గోదాములు బూడిద..!
హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ వద్ద ఆరు గోదాముల్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫర్నిచర్, ప్లైవుడ్, డైపర్ వంటి వస్తువులు నిల్వ ఉన్న గోదాములు దగ్ధమయ్యాయి. ఐదు ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుడిమల్కాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మొగల్ కానాల వద్ద ఫర్నిచర్, ప్లైవుడ్ గోదాముల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. గోదాముల్లో భారీగా చెక్క, ప్లైవుడ్, ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో మంటల తీవ్రత మరింత పెరిగింది.
అగ్నిప్రమాదం కారణంగా గోదాముల్లోని ఫర్నిచర్, ప్లైవుడ్, ఇతర సామగ్రి భారీగా దగ్ధమైందని సమాచారం. మంటలు పక్కనే ఉన్న గోదాములకు కూడా వ్యాపించే అవకాశం ఉండటంతో యజమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఐదు ఫైర్ ఇంజిన్లతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. రెండు గోదాముల్లో మంటలను పూర్తిగా నియంత్రించగా.. మరో రెండు గోదాముల్లో కొంతసేపు మంటలు ఎగిసిపడ్డాయి. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.
డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం సుమారు 11 గంటల సమయంలో గోదాంలో అగ్నిప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం ఆరు గోదాములకు మంటలు వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వీటిలో ఐదు గోదాముల్లో ప్లైవుడ్ సామగ్రి ఉండగా.. మరో గోదాంలో డైపర్లు, ఇతర వస్తువులు నిల్వ చేసినట్లు తెలిపారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. షార్ట్‌సర్క్యూట్ లేదా ఇతర కారణాలపై పోలీసులు, అగ్నిమాపక అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
