Andhra Pradesh: మ్యాచ్ ఉంటే చాలు మడతపెట్టేస్తారు.. కేటుగాళ్ల గుట్టురట్టు చేసిన ప్రకాశం పోలీసులు..

ప్రకాశం జిల్లాలో ఆన్‌లైన్‌ బెట్టింగుల ముఠా పట్టుబడటంతో కలకలం రేగింది. సింగరాయకొండలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న రెండు ముఠాలకు చెందిన ప్రధాన నిందితులు నరాల ప్రసాద్‌, ఎం. శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి దగ్గర నుంచి 99 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు.

Andhra Pradesh: మ్యాచ్ ఉంటే చాలు మడతపెట్టేస్తారు.. కేటుగాళ్ల గుట్టురట్టు చేసిన ప్రకాశం పోలీసులు..
Prakasham Police Bust Online Betting Gang In Singarayakonda Telugu Crime News

Edited By: Anil kumar poka

Updated on: Oct 07, 2023 | 8:09 PM

అటు అంతర్జాతీయ వన్టే క్రికెట్‌ ప్రారంభమైందో లేదో ఇటు క్రికెట్‌ బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. భారత్ ఆతిథ్యమిస్తున్న అత్యున్నత టోర్నీ ప్రపంచకప్ వన్‌డే పోటీలు అహ్మదాబాద్‌లో గురువారం ప్రారంభం కావడంతో బుకీలంతా బెట్టింగ్‌ పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. నెలరోజుల పాటు జరగనున్న ఈ పోటీల కారణంగా బెట్టింగ్‌ రాయుళ్లు పండుగ చేసుకుంటున్నారు. అయితే ఈ బెట్టింగ్‌ ఊబిలో పడి విద్యార్ధులు, యువకులు ఇల్లు, ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారు… యువత విపరీతమైన ఆశక్తితో టివిలకు, మొబైళ్ళకు అతుక్కుపోయి చూసే ఈ ఆటను ఆస్వాదిస్తే బాగానే ఉంటుంది, అయితే ఇదే వ్యసనంగా మారి బెట్టింగ్‌లు కట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. గతంలో డబ్బున్నవారికి మాత్రమే వ్యసనంగా ఉన్న బెట్టింగ్‌ల భూతం నేడు తన పరిధిని విస్తరించుకుని ఢిల్లీ నుంచి గల్లీదాకా పాకింది. పందేలు కూడా వివిధ రూపాల్లో కడుతున్నారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌ వచ్చిన తరువాత ఇక అన్నీ ఆన్‌లైన్‌లోనే చిటికెల్‌ జరిగిపోతున్నాయి. బెట్టింగ్‌ కట్టడం, డబ్బులు పంపించడం, తీసుకోవడం అన్నీ ఆన్‌లైన్‌లోనే. దీంతో ఈ బెట్టింగ్‌ రాయుళ్ళ ఆట కట్టించేందుకు పోలీసులకు తలకుమించిన భారంలా మారింది.

ముంబయ్‌ నుంచి ఒంగోలు దాకా..

క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ళకు ప్రధాన అడ్డగా ముంబయి నగరం పేరు గాంచింది. మహారాష్ట్రలోని ముంబయితో పాటు నాగ్‌పూర్‌, పూణే లాంటి ప్రధాన నగరాల్లో మాస్టర్‌ బుకీలు ఆపరేట్‌ చేస్తుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలతో పాటు ఆయా రాష్ట్రాల్లొని జిల్లా స్థాయి బుకీలు, అలాగే వారి కింద పనిచేసే చోటా బుకీల ద్వారా యువతకు గాలెం వేస్తారు. ఐదేళ్ళ క్రితంవరకు బెట్టింగ్ రాళ్లు ఎక్కడో ఒక చోట కూర్చుని టీవీ, బోర్డు ఏర్పాటుచేసుకుని మ్యాచ్ చూస్తూ మొబైల్, ల్యాండ్‌లైన్‌ ఫోనుల ద్వారా పందేలు కాసేవారు. నగదు చెల్లింపులు కూడా హ్యాండ్‌ టు హ్యాండ్‌ ఉండేవి.. అయితే ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా బెట్టింగ్‌లు కాయడం, నగదు చెల్లింపులు చేయడం అందుబాటులోకి రావడంతో వీరి వ్యవహారాలు ఇంకా సులువుగా మారాయి. దీంతో బెట్టింగ్‌ వ్యాపారాన్ని వేగంగా దేశవ్యాప్తంగా విస్తరింప చేశారు. ఇప్పుడు నగదు చెల్లింపులన్నీ యూపీఐ ఐడీల ద్వారానే సాగుతున్నాయి. నెట్‌ బ్యాంకింగ్‌, ఫోన్ పే, గూగుల్‌ పేల ద్వారా నగదు చెల్లిస్తే ఆన్లైన్ యాప్లో లింక్ పంపుతున్నారు. ఆ లింకు తెరవాలంటే యూజర్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నారు. దాని ఆధారంగా బెట్టింగ్ యాప్లో ప్రవేశించి పందేలు కాస్తున్నారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 20 మంది వరకు బుకీలు ఉన్నారని అంచనా.. వీరికింద మరో 300 మంది చోటా బుకీలు ఉన్నారు. వీరంతా వేల మంది విద్యార్థులు, యువకులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ బెట్టింగ్ మోజులో పడేట్లు చేస్తున్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో మ్యాచ్‌కు 300 కోట్లలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయని ఒక అంచనా. బెట్టింగుల్లో పీకల్లోతులో కూరుకుపోయి చితికిపోయిన కుటుంబాలూ ఉన్నాయి. చేసిన అప్పులు తీర్చేదారిలేక యువకులు చోరీలు, చైన్‌ స్నాచింగ్‌లకు దిగుతూ క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇలాంటి విద్యార్ధుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. పోలీసులు అప్పుడప్పుడు దాడులు చేసి పట్టుకుంటున్నా క్రికెట్ బెట్టింగ్‌లు ఆగడం లేదు. ఒంగోలు వేదికగా గతంలో దేశవ్యాప్తంగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఓ బుకీని పోలీసులు అరెస్ట్‌ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం వీరంతా రాజకీయనేతల పంచన చేరి పోలీసుల దాడుల నుంచి తప్పించుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

తాజాగా ఇద్దరు బుకీలు అరెస్ట్‌..

అంతర్జాతీయ క్రికెట్ వన్డే పోటీలకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వడంతో ప్రకాశంజిల్లా పోలీసులు క్రికెట్ బెట్టింగ్‌ రాయుళ్ళపై నిఘా పెట్టారు. దీంతో సింగరాయకొండలో క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న రెండు ముఠాలను గుర్తించి దాడులు చేశారు. ఈ దాడుల్లో రెండు ముఠాల్లో ప్రధాన నిందితులుగా ఉన్న మూలగుంటపాడుకు చెందిన 44 ఏళ్ళ నరాల ప్రసాద్, అదే గ్రామానికి చెందిన 29 ఏళ్ళ మరో బుకీ ఎం. శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముందుగా అందిన సమాచారంతో సింగరాయకొండ సిఐ రంగనాథ్, ఎస్‌ఐ శ్రీరామ్ తమ సిబ్బంది తో కలసి దాడులు చేసి నిందితుల నుంచి 99 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌లనుప్రత్యక్షంగా లేదా ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఆడినట్లయితే లేదా ఆన్లైన్ బెట్టింగ్ ఆడిపిస్తున్నా… వారి పైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్‌పి మలికగార్గ్‌ హచ్చరిస్తున్నారు.