ORR Road Accident: ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. కారు-టిప్పర్ ఢీ.. ఎంపీటీసీ దంపతుల దుర్మరణం
ఓ నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. హైదరాబాద్ మహానగర శివారులోని ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఎంపీటీసీ దంపతులు మృతిచెందారు.
ORR Road Accident: ఓ నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. హైదరాబాద్ మహానగర శివారులోని ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఎంపీటీసీ దంపతులు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి మండలం తానేదార్‌పల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు దొంతం కవిత తన భర్తతో వేణుగోపాల్ రెడ్డితో కలిసి హైదరాబాద్ వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఓఆర్ఆర్ దాటిన తర్వాత ఉన్న యూ టర్న్ వద్ద ముందు వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో ట్రక్ వెనకాలే ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి, టిప్పర్‌ను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
టిప్పర్‌ను వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న ఎంపీటీసీ కవిత, ఆమె భర్త, టీఆర్‌ఎస్ పార్టీ నేత అయిన వేణుగోపాల్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను కారులోనుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. రోడ్డు ప్రమాదంలో దంపతులిద్దరు మృతి చెందడంతో అనిశెట్టి దుప్పలపల్లిలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా, ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.