కన్నబిడ్డపైనే ఆ కామాంధుడి కళ్లు పడ్డాయి. రెండేళ్లపాటు సొంతకూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసులో దుర్మార్గుడికి యావజ్జీవ జైలు శిక్ష పడింది . వివరాల్లోకి వెళితే, ఈ ఘటన అసోంలోని నౌగావ్ ప్రాంతంలో జరిగింది. భార్య చనిపోవడంతో తొమ్మిది సంవత్సరాల బాలిక తండ్రితో కలిసి నివసిస్తోంది. అయితే ఇదే అదునుగా చేసుకుని ప్రతిరోజు లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. ఇలా రెండేళ్లపాటు దారుణంగా ప్రవర్తించాడు. అయితే తండ్రి వేధింపులను తట్టుకోలేని బాలిక 2017లో ఇంట్లోంచి పారిపోయింది.
బాలికను సమీప ప్రభుత్వాసుపత్రి నర్సులు చేరదీయడంతో, తాను అనుభవిస్తున్న బాధను, కన్నతండ్రి చేసిన దాష్టీకాన్ని చెప్పి కన్నీరుమున్నీరైంది. దీంతో ఆ నర్సులు పాపను రక్షించి కల్పించి, పోలీసులకు విషయాన్ని చేరవేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసు విచారణ దాదాపు రెండున్నరేళ్లు కొనసాగి , తాజాగా తీర్పు వెలువడింది. ఇంతటి మానవ మృగం సభ్య సమాజంలో నివసించేందుకు అర్హుడు కాదని, అతనికి జైలే సరైనదని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానిస్తూ అతడికి యావజ్జీవ జైలు శిక్షను విధించింది.