ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 9 కిలోల బంగారం మాయమైంది. ఆర్థిక అవసరాలకు తమ దగ్గర తాకట్టు పెట్టిన బంగారంతో ఉడాయించాడు. ఆడిట్ చేస్తే గానీ ఈ విషయం కంపెనీకి తెలియకపోవడం గమనార్హం. విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కంపెనీ, బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. చోరీకి గురైన బంగారం వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ నాగారం దమ్మాయిగూడలోని ఐఐఎఫ్ఎల్ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో భారీగా బంగారం మాయమైంది. దాదాపుగా తొమ్మిది కిలోల వరకు బంగారాన్ని మాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇదంతా ఆర్థిక అవసరాల కోసం కస్టమర్లు తాకట్టు పెట్టిన సొమ్ము. మొత్తం 63 మంది కస్టమర్లకు సంబంధించిన 163 లోన్ అకౌంట్ లో నుంచి తొమ్మిది కేజీల బంగారాన్ని అపహరించారు.
అదే బ్రాంచ్ లో అప్రైజర్ గా పని చేస్తున్న తోట రాజ్ కుమార్ ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బంగారం క్వాలిటీ చెక్ చేయటం, వెయిట్ చేయడం, దాన్ని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచటం అతడి పని. ఇలా స్ట్రాంగ్ రూమ్ లకు బంగారం తరలిస్తుండగా… విడతల వారీగా సొమ్మును అపహరించినట్లు చెప్పారు. నిందితుడిని కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలానికి చెందిన రాజ్ కుమార్ గా గుర్తించారు. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఐఐఎఫ్ఎల్ అధికారులు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఆఫీస్ కు తాళం వేసి.. లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. ఈ నెల పదో తారీఖు నుంచి ఆడిట్ జరుగుతుండగా.. 12 వ తేదీన ఖజానా మేనేజర్ మల్లేశ్ బంగారం నిల్వల్లో తేడా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే ఉద్యోగం మానేసిన తోట రాజ్ కుమార్ పై అనుమానం వ్యక్తం చేస్తూ.. అతడిని అదుపులోకి తీసుకున్నారు.
మాయమైన మొత్తం బంగారం విలువ రూ.4.3 కోట్లు కాగా.. రాజ్ కుమార్ ఆ బంగారాన్ని తన పేరు మీద, ఇతర వ్యక్తుల పేర్ల మీద హైదరాబాద్ లోని పలు గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టి సుమారు రెండున్నర కోట్ల రూపాయలు తీసుకున్నాడు. తాకట్టు పెట్టి తీసుకున్న మొత్తం సొమ్మును క్రికెట్ బెట్టింగ్ యాప్ లో పెట్టాడు. బెట్టింగ్ వ్యసనంతో రాజ్ కుమార్ ఈ చోరీ చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. గతేడాది ఏప్రిల్ నుంచి విడతలవారీగా బంగారాన్ని దొంగిలించాడు రాజ్ కుమార్. అతనిపై కీసర పోలీసులు చీటింగ్, నమ్మకద్రోహం కేసులు పెట్టారు. వైద్య పరీక్షల అనంతరం రిమాండ్ కి తరలించారు. ఈ వ్యవహారంలో రాజ్ కుమార్ కు ఇంకా ఎవరైనా సహకరించారా, ఏఏ బ్రాంచీలో బంగారాన్ని తాకట్టు పెట్టారు అనే విషయాలను ఆరా తీస్తున్నారు. అయితే సరైన పత్రాలు, రశీదులు లేకుండా బంగారాన్ని తాకట్టుకు తీసుకున్నారని తేలితే సదరు సంస్థలపై కూడా తప్పకుండా చర్యలు ఉంటాయని పోలీసులు అంటున్నారు.
ఇవీచదవండి.
Green Chilli: కారంపొడి, పచ్చి మిర్చి రెండింటిలో ఏది బెటర్.. ఈ విషయాలు మీరు అస్సలు నమ్మలేరు
Sammakka Saralamma Jatara: వనంలో జనం.. భక్తజన సంద్రమైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.. (వీడియో)