Cop feeding cake to Criminal: సాధారణంగా ఎవరైనా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంటే.. అక్కడున్న వారందరినీ ఆహ్వానిస్తుంటారు. ముక్కు.. మొఖం తెలియకపోయినా సరే పిలిచి వేడుకను నిర్వహించుకుంటారు. ఈ క్రమంలో వచ్చినవారికి.. బర్త్ డే జరుపుకుంటున్న వారు కేక్ తినిపించడం కామన్. అలానే తన బర్త్ డే వేడుకకు వచ్చిన ఓ క్రిమినల్‌కు.. ఓ పోలీసు అధికారి కేక్ తినిపించి చిక్కుల్లో పడ్డారు. రెండు వారాల క్రితం జరిగిన బర్త్‌డే వేడుకలకు సంబంధించిన వీడియో, ఫొటో ఆలస్యంగా వెలుగుచూడటంతో.. ముంబై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీనిపై గురువారం ముంబై డీసీపీ మహేష్ రెడ్డి విచారణకు ఆదేశించడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది.
ముంబైలోని పలు ప్రాంతాల్లో డానిష్ షేక్ అనే వ్యక్తిపై హత్యాయత్నం, పలు నేరాల కింద కేసులు నమోదై ఉన్నాయి. ఈ క్రమంలో డానిష్‌ను సబర్భన్ జోగేశ్వరి పోలీసులు అరెస్టు చేసి విచారించారు. అయితే.. అదే స్టేషన్‌లో సీనియర్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మహేంద్ర నెర్లీకర్ పుట్టినరోజు వేడుకలను రెండు వారాల క్రితం హౌసింగ్ సొసైటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న డానిష్‌కు మహేంద్ర కేక్ తినిపించారు. అనంతరం కొన్ని రోజుల తర్వాత.. దాదాపు 15 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ముంబై డిప్యూటీ పోలీసు కమిషనర్ మహేష్ రెడ్డి ప్రాథమిక విచారణకు ఆదేశించారు. సకినాకా డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఈ విచారణను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మహేంద్ర నెర్లీకర్‌ను కంట్రోల్ రూమ్‌కు అటాచ్ చేశారు.
కాగా.. ఈ సంఘటనపై మహేంద్ర నెర్లీకర్ మాట్లాడుతూ.. ఇది పాత వీడియో అని తెలిపారు. కూల్చివేత పనులు జరుగుతున్న హౌసింగ్ సొసైటీని సందర్శించానని.. అదే రోజు తన పుట్టినరోజు కావడంతో కొందరు పుట్టినరోజు వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. ఆ సమయంలో డానిష్ అక్కడ ఉన్నట్లు తనకు తెలియదంటూ పేర్కొన్నారు.
Also Read: