మహారాష్ట్రలో ఆటో పార్ట్స్ డీలర్ మాన్సుఖ్ హీరేన్ మృతి కేసులో పోలీసు అధికారి సచిన్ వాజేను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అధికారులు అరెస్టు చేశారు. ఆయనను వారు సుమారు 12 గంటలపాటు విచారించారు. పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటివద్ద పార్క్ చేసిన వాహనంలో పేలుడు పదార్థాలు ఉంచినట్టు అనుమానించిన ఈయనను ఆదివారం ఉదయం ముంబైలోని ఎన్ఐఏ కార్యాలయానికి మళ్ళీ తీసుకువచ్చారు. మరో రెండు సంబంధిత కేసుల్లో కూడా రాష్ట్రయాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆయనను విచారించనుంది. మాన్ సుఖ్ హిరేన్ మృతి కేసుతో బాటు ఆయన వాహనాన్ని అక్రమంగా తన వద్ద సుమారు 4 నెలల పాటు అతనికి ఇవ్వకుండా వేధించినట్టు ఆయన భార్య చేసిన ఆరోపణల నేపథ్యంలో కూడా వాజేను ఈ విభాగం విచారించనుంది. ఈ కారును దొంగిలించారని కూడా మాన్ సుఖ్ భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కాగా- ఈ వాహనం ముకేశ్ అంబానీ ఇంటివద్ద అనుమానాస్పద స్థితిలో ఉండగా పోలీసులు కనుగొన్నారు. ఆ తరువాత గత నెల 24 న మాన్ సుఖ్ మృతదేహాన్నికూడా కనుగొనడం, మహారాష్ట్ర శాసన సభలో ఈ వ్యవహారంపై పెద్దఎత్తున పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య విస్తృత చర్చ జరగడం తెలిసిందే. బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో బాటు సభ్యులంతా డిమాండ్ చేయడంతో సచిన్ వాజేను ప్రభుత్వం తొలగించి,,కేసు దర్యాప్తు ముగిసేవరకు మరో విభాగానికి బదిలీ చేసింది.
కాగా తనకు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయాలనీ కోరుతూ వాజే థానే జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.తనను అరెస్టు చేయకుండా చూడాలని కోరిన ఆయన.. ఈ కేసులో తనపై ఆరోపణలు నిరాధారాలని పేర్కొన్నారు. ఈయన బెయిల్ పిటిషన్ పై ఈనెల 19 న కోర్టు విచారణ జరపనుంది.ఇతడికి నార్కో ఎనాలిసిస్ టెస్ట్ జరపాలని డిమాండ్ చేసిన బీజేపీ,, ఇతడిని రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించింది.
మరిన్ని ఇక్కడ చదవండి: