Telangana Electricity Bill: ప్రతీనెల కరెంట్ బిల్లు రావడం సర్వసాధారణమే.. అయితే.. కరెంటు బిల్లు మహా అయితే.. వందల్లో, లేకపోతే వేలల్లో కానీ వస్తుంది. అయితే.. అలా కాకుండా ఒక ట్యూబ్ లైటు, ఒక ఫ్యాను ఉన్న ఓ మొబైల్ షాపుకి రూ.లక్షల్లో కరెంటు బిల్లు రావడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. ఇదేంటి.. అంత బిల్లు ఎందుకు వస్తుందని ఆ వ్యక్తి ప్రశ్నిస్తే.. ముందు రీడింగ్ చూసుకో అంటూ విద్యుత్ అధికారులు మండిపడుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో చోటుచేసుకుంది. జడ్చర్ల పట్టణంలో వెంకటాచారి అనే వ్యక్తి కె.వి మొబైల్ రిపేరింగ్ పేరుతో షాపును నిర్వహిస్తున్నాడు. అయితే.. నిర్వాహకుడు తన షాపులో కేవలం ఒక ఫ్యాన్ ఒక లైటు మాత్రమే వినియోగిస్తున్నాడు. దీంతో అతనికి ప్రతి నెల రూ.200 నుంచి రూ.400 వందల వరకు విద్యుత్ బిల్లు వస్తుండేది.
కానీ ఈ నెల ఏకంగా 7,29 ,442 రూపాయల విద్యుత్ బిల్లు రావడంతో వినియోగదారుడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఇదేంటని విద్యుత్ అధికారులను నిలదీయడంతో.. మీటర్ రీడింగ్ అంతే ఉందని, తాము కూడా ఉన్న బిల్లు మాత్రమే ఇచ్చామని పేర్కొన్నారు. ఓ చిన్న షాపునకు సాధారణంగా వంద నుంచి రూ.150 బిల్లు వస్తుంది. అయితే ఈ షాపుకి 33 రోజులకు 4 లక్షల 29 వేల యూనిట్లు కాలినట్లు రీడింగ్ వచ్చింది. దీనికి 7లక్షల 29 వేల 442 బిల్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
వినియోగదారుడు చేసేది ఏమీ లేక అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ప్రతినెల వందల్లో వచ్చే విద్యుత్ బిల్లు ప్రస్తుతం రూ.లక్షల్లో రావడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశాడు. సామాన్య కుటుంబానికి చెందిన తనకు లక్షల్లో బిల్లులు వస్తే ఎలా చెల్లించాలని వెంకటాచారి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నాడు.
Sami, Tv9 Telugu Reporter, Mahabubnagar
Also Read: