విధి మనుషుల జీవితాలతో ఎలా ఆడుకుంటుందో చెప్పడానికి తాజా ఘటన ఉదాహారణ. కూతురుకు అట్టహాసంగా పెళ్లి చేశాడు ఆ తండ్రి. బంధు మిత్రులతో, మామిడి తోరణాలతో ఇల్లంతా సంతోషంగా ఉంది. అంతలోనే ఊహించని విషాదం. పెళ్లి ఇంట్లో.. వధువు తండ్రి చావు ఊహించని కన్నీళ్లని మిగిల్చింది.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా, జమ్మికుంటలో నివశించే మేకల దాసు శుక్రవారం రోజున కూమార్తె పెళ్లి జరిపించాడు. పెద్ద కూతురు కావడంతో ఏర్పాట్లు భారీగా చేశాడు. తెలిసిన వారందర్నీ వేడకకు ఆహ్వానించాడు. పెళ్లి అనంతరం రాత్రి ఊరేగింపు వేడుక మొదలైంది. అందరూ సంబంరంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఆనందంలో ఉన్న పెళ్లి కూతురు తండ్రి దాసు కూడా వారితో కాలు కదిపాడు. కానీ వెంటనే కిందపడిపోయాడు. జారి పడిపోయాడేమో అని పక్కకు తీసుకువెళ్లి చూడగా, అతను అప్పటికే అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే గుండెపోటుతో మృతి చెందారని డాక్టర్లు పేర్కొన్నారు. దీంతో పెళ్లి ఇంట్లో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి.