AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లవర్‌ను అర్ధరాత్రి పొలాల్లోకి తీసుకెళ్లాడు..! ఆరు నెలల తర్వాత బయటపడిన దారుణం..

గడగ్‌లోని నారాయణపుర గ్రామానికి చెందిన సతీష్, మధుశ్రీ అనే యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని మధుశ్రీ కోరినప్పుడు, సతీష్ ఆమెను హత్య చేసి గుంటలో పూడ్చాడు. ఆరు నెలల తర్వాత ఈ దారుణం బయటపడింది. సీసీటీవీ ఫుటేజ్‌, పోలీసుల విచారణ ఆధారంగా సతీష్‌ను అరెస్ట్ చేశారు.

లవర్‌ను అర్ధరాత్రి పొలాల్లోకి తీసుకెళ్లాడు..! ఆరు నెలల తర్వాత బయటపడిన దారుణం..
Madhu Sri And Satheesh
SN Pasha
|

Updated on: Jun 15, 2025 | 6:15 PM

Share

తాను ప్రేమించిన అమ్మాయిని ఓ యువకుడు అర్ధరాత్రి సమయంలో తన పొలానికి తీసుకెళ్లాడు. ఆ రోజు నుంచి ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది. అతన్ని అడిగితే నాకు తెలియదు అన్నాడు. కట్‌ చేస్తే ఆరు నెలల తర్వాత అసలు దారుణం బయటపడింది. పెళ్లి చేసుకోవాలని అడిగిన అమ్మాయిని చంపి, గుంటలో పూడ్చిపెట్టిన ప్రేమికుడి కేసును గడగ్ పోలీసులు ఛేదించారు. గడగ్ తాలూకాలోని నారాయణపుర గ్రామానికి చెందిన సతీష్ హిరేమత్, అదే గ్రామానికి చెందిన మధుశ్రీ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఒక రోజు ఇద్దరూ ఎవరికీ తెలియకుండా గ్రామ శివార్లలోని పొలంలో కలుసుకున్నారు. ఆ సమయంలో మధుశ్రీ తనను వివాహం చేసుకోవాలని డిమాండ్ చేసింది. తరువాత, ఇద్దరి మధ్య గొడవ జరిగింది, సతీష్ మధుశ్రీని గొంతు కోసి చంపాడు. తరువాత, ఆమెను సమీపంలోని గుంటలో పూడ్చిపెట్టాడు. ఆరు నెలల తర్వాత అతను ఎలా దొరికాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మధుశ్రీ అంగడి గడగ్ తాలూకాలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన అమ్మాయి. ఆమె అదే గ్రామానికి చెందిన సతీష్ హిరేమత్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇద్దరూ ఐదారు ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే మధుశ్రీ కుటుంబానికి ఈ ప్రేమ వ్యవహారం తెలిసింది. దీంతో వారు ఆమెను గడగ్‌లోని ఆమె బంధువుల ఇంట్లో తీసుకెళ్లి పెట్టారు. కొన్ని నెలలుగా విడిగా ఉన్న ఆ జంట తిరిగి కలిశారు. డిసెంబర్ 16, 2024 రాత్రి మధుశ్రీ గడగ్ నగరంలోని తన బంధువుల ఇంట్లో నుండి అదృశ్యమైంది. బంధువులు అన్ని చోట్లా వెతికి చివరకు జనవరి 12, 2025న బెటగేరి బరంగే పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ సమయంలో పోలీసులు అనుమానంతో సతీష్‌ను ప్రశ్నించగా తనకేమీ తెలియనట్లు నటించాడు.

ఇంతలో ఇద్దరూ ఒకే బైక్ పై వెళుతున్న సీసీటీవీ వీడియో కూడా దొరికింది. దీని ఆధారంగా పోలీసులు సతీష్ ను మళ్ళీ ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. అప్పటికీ బైక్ పై తాము ఇద్దరు వెళ్లింది నిజమే కానీ, తాను మధుశ్రీని హతాలగేరి గ్రామం దగ్గర వదిలి పెట్రోల్ బంకులో పనికి వెళ్లానని చెప్పాడు. ఆమె ఎక్కడికి వెళ్లిందో తనకు తెలియదని బుకాయించే ప్రయత్నం చేశాడు. కానీ, పోలీసులు తమదైన స్టైల్లో విచారించే సరికి మొత్తం నిజం కక్కేశాడు. డిసెంబర్ 16, 2024న మధుశ్రీని గడగ్ తాలూకాలోని నారాయణపూర్ గ్రామ శివార్లలోని తన పొలానికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో, మధుశ్రీ పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. దీనితో ఇద్దరి మధ్య గొడవ జరిగి, అది ఘర్షణకు దారితీసింది. సతీష్, మధుశ్రీని గొంతు కోసి హత్య చేశాడు. ఆపై ఏమీ తెలియనట్లు నటిస్తూ ఆమె మృతదేహాన్ని సమీపంలోని కాలువలో పడేశాడు.

అతను తరచుగా ఆ ప్రాంతానికి వచ్చి ఎముకలను వేర్వేరు ప్రదేశాల్లో వేసి ఆధారాలను నాశనం చేయడానికి ప్రయత్నించేవాడు. పోలీసుల విచారణ తర్వాత అతను మృతదేహాన్ని తీసుకెళ్లిన ప్రదేశాన్ని చూపించాడు. ప్రస్తుతం మృతదేహంలోని కొన్ని ఎముకలు కనుగొన్నారు పోలీసులు. కానీ ఆమె మృతదేహం ఇంకా దొరకలేదు. మొత్తంగా మధుశ్రీ మృతదేహం అవశేషాలను పోలీసులు ఒక గుంటలో కనుగొన్నారు. దానిని వారు DNA పరీక్ష కోసం పంపారు. తనను పెళ్లి చేసుకోమని అడిగినందుకు ప్రియుడు సతీష్ తన ప్రేయసి మధుశ్రీని హత్య చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేసి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి