Krishna district Swim Death: కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ మందుబాబును కాపాడబోయి మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని కొండూరు మండలం ముత్యాలంపాడులో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. ముత్యాలంపాడు గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు.. మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకుంటాంటూ చెరువులో దూకాడు. ప్రవీణ్ వెంట ఉన్న అతని ఇద్దరు స్నేహితులు చిలపరపు నాని (19), పచ్చిగోళ్ళ చిన్న కోటేశ్వరరావు (34) ప్రవీణ్‌ను రక్షించడానికి చెరువులో దూకారు.
అయితే..ఆత్మహత్య చేసుకుంటానంటూ చెరువులో దూకిన ప్రవీణ్‌కు ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రవీణ్ కోసం చెరువులో దూకిన ఇద్దరికి ఈత రాకపోవడంతో నీట మునిగి గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కాగా, చెరువులో మునిగిన నాని మృతదేహం లభ్యం కాగా, కోటేశ్వరరావు మృతదేహం కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. ఒకరిని కాపాడబోయి ఇద్దరు యువకులు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.