Young Man crushed Kadapa SI: కర్ఫ్యూ సమయంలో ఓ కుర్రాడు బయటకు వచ్చాడు. రోడ్డుపై ఎస్సై ఉన్నాడని చూసి.. బండిని యూ టర్న్ తీసుకున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన బండిని తప్పించబోయి.. కిందపడ్డాడు. అంతే.. కర్రపట్టుకొని పరుగులు పెడుతూ వచ్చిన ఎస్సై.. కుర్రాడిపై ప్రతాపం చూపాడు. గొడ్డును బాదినట్లు బాదేశాడు. కడప జిల్లా కేంద్రం టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని శివలింగం బీడీ ఫ్యాక్టరీ దగ్గర జరిగిన ఈ ఘటన సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది.
కాగా, యువకుడు పట్ల ఎస్సై జీవన్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారని టీవీ9 లో కథనాలు ప్రసారమయ్యాయి. టీవీ9 కథనాలకు స్పందించిన జిల్లా పోలీసు యంత్రాంగం ఎస్సై జీవన్ రెడ్డిపై వేటు వేసింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ అన్బు రాజన్ స్పందించారు. కడప టూ టౌన్ ఎస్‌ఐ జీవన్ రెడ్డిని వీఆర్(వేకెన్సీ రిజర్వ్)కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా ఎస్పీ అన్బు రాజన్.
కరోనా నిబంధనల పేరుతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు అవుతోంది. రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించారు. అయితే ఓ యువకుడ బయటకు రావడమే తపైంది. దానికే అంతలా రెచ్చిపోవలా? మరి ఈ తరహాలో లాఠీకి పనిచెప్పాలా? మరి ఇంత దారుణంగా కొడతారా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుర్రాడిది తప్పే కావచ్చు.. మరి ఎస్సై చేసింది కరెక్టేనా? అని ప్రశ్నిస్తున్నారు. లాక్‌డౌన్ టైంలో బయటకు వచ్చిన కుర్రాడిని హెచ్చరిస్తే.. సరిపోదా? అంతకు కాకపోతే.. ఒక్కటి అంటిస్తే.. సరిపోదా.. అంటూ ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరూ సూచిస్తున్నారు. కాగా, ఈ ఘటనలో సదరు యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
కడప నగరంలోని శివలింగం బీడీ ఫ్యాక్టరీ వద్ద కర్ఫ్యూ సమయంలో బయటికి వచ్చిన ఓ యువకుడిని టూటౌన్ ఎస్‌ఐ జీవన్‌రెడ్డి లాఠీతో చితకబాదాడు. కర్ఫ్యూ సమయంలో సాయంత్రం 5 గంటలకు ఆ యువకుడు బయటకు వచ్చిన సమయంలో శివలింగ బీడీ ఫ్యాక్టరీ వద్ద పోలీసులకు చూసి భయపడి స్కూటీ తిప్పుకుని వెళ్ళిపోతుండగా ఎస్సై జీవన్ రెడ్డి తరుముకోవడంతో బైక్‌పై నుంచి యువకుడు కింద పడిపోయాడు. కింద పడటంతో ఆ యువకుడిపై ఎస్‌ఐ జీవన్ రెడ్డి లాఠీ జూలూపించాడు. యువకుడిని చితకబాదిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో ఎస్‌ఐ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.