Online blackmailing : ఫేస్‌బుక్ ఖాతాల నుంచి మహిళల నెంబర్లు సేకరించడం..నగ్న చిత్రాలు పంపమని బెదిరించడం. ఇది ఓ కేటుగాడి తంతు. పాపం ఏదో ఒక రోజు పండక మానదు. తాజాగా ఈ అతిగాడి తిక్క కుదిర్చారు రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు. శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో నివసించే మోటా దుర్గాప్రసాద్ (23) ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంటాడు. ఇంటర్నెట్‌లో నీలి చిత్రాలు చూడటం అతడికి వ్యసనంగా మారింది. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల నుంచి అమ్మాయిల నెంబర్లు సేకరించడం మొదలుపెట్టాడు. ఆపై వాట్సాప్ ద్వారా అసభ్యకర వీడియోలను, దృశ్యాలను పంపించేవాడు. మహిళలకు వీడియో కాల్స్ చేసి వారి న్యూడ్ పిక్స్ పంపించాలంటూ బెదిరించేవాడు. అలా చెయ్యకుంటే సదరు మహిళల మొబైల్ నంబర్లను పోర్న్ వెబ్‌సైట్‌లో పెడతానని బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఈ క్రమంలో సిటీకి చెందిన ఓ మహిళా న్యాయవాదికి వాట్సాప్ లో మెసేజ్ లు చేస్తూ వేధింపులతో గురి చేయడంతో ఆమె రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఆశ్రయించింది.
దీంతో నేరగాడి కోసం వెతుకులాట ప్రారంభించారు పోలీసులు. టెక్నాలజీ ఉపయోగించి నిందితుడు దుర్గా ప్రసాద్‌ను శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఇతనిపై నల్లగొండ, సైబరాబాద్ పరిధిలో పలు కేసులు ఉన్నాయని, గతంలో జైలుకు కూడా వెళ్లివచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయినా తన తీరు మార్చుకోకుండా మహిళలను వేధింపులకు గురి చేస్తున్నట్లు తేలింది.
Read More : గుడ్ న్యూస్ : ‘మై జీహెచ్‌ఎంసీ యాప్’తోనూ ఆస్తిపన్ను చెల్లింపులు