Hyderabad Kidnaped Girl Identified: హైదరాబాద్ మహానగర శివార్లలో దారుణం చోటుచేసుకుంది. కనిపించకుండాపోయిన ఆరేళ్ల చిన్నారి తీవ్ర గాయాలతోఅచేతన స్థితిలో రోడ్డు పక్కన పడి ఉంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దారుణం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ నగర ప్రాంతం జవహర్‌నగర్ పరిధిలోని దమ్మాయిగూడలో ఆరేళ్ల బాలికను ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. దమ్మాయిగూడకు చెందిన శ్రీను.. తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. నిన్న సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన చిన్నారిని ఎత్తుకెళ్లాడు. ఒంటిపై గాయాలతో స్పృహలేని స్థితిలో ఉన్న ఆ చిన్నారిని ఇవాళ ఉదయం ప్రగతినగర్‌లో వదిలిపెట్టాడు. బాలికను గమనించిన స్థానికులు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న శ్రీనును పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అక్కడికి చేరుకున్న పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకుని.. ఆ చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, బాలిక కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే క్రమంలో స్థానికుల సమాచారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.